ఏపీలో ఉపాధి హామీ పథకం పనులు సంకటంలో పడ్డాయి. ఏడాదిలో పూర్తి చేయాల్సిన ఉపాధి పని దినాల లేబర్ బడ్జెట్ ను రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసేసింది. అదనపు బడ్జెట్ కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎదురు చూడాల్సిందే. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఐదు నెలల కాలం గ్రామాల్లో ఉపాధి పనులు జరిగే అవకాశం లేదు. ఒకవేళ పనులు చేపట్టిన కేంద్రం నుండి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో కూలీలకు కొత్త పనులు దక్కే అవకాశం లేనట్లే. ఉపాధి హామీ కూలీలకు ఏపీలో చివరిగా వేతనాలు ఆగస్టు 15న జమయ్యాయి.
ఆ తర్వాత నుంచి ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. ఈ రెండున్నర నెలలుగా వేతనం అందక వాటి పైన ఆధారపడిన కుటుంబాల్లో ఆకలి కేకలు మిన్నంటాయి. ఎస్సీ, ఎస్టీల కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చివరిగా వారికి జూలై 30 న వేతనాలు అందాయి. రాష్ట్రం స్పందించి నిధులు సర్దుబాటు చేయకపోతే ఫిబ్రవరి వరకు పనులు నిలిపివేయాల్సిందేనని ఉపాధి పథకం వర్గాలే చెబుతున్నాయి. ఏపీకి20.70 కోట్ల పని దినాల తోకేంద్రం లేబర్ బడ్జెట్ కేటాయించింది. ఇందులో రాష్ట్రం ఇప్పటికే 21.63 కోట్ల పని దినాలు కల్పించింది. అంటే ఆమోదించిన లేబర్ బడ్జెట్ కన్నా ఎక్కువ పనులు జరిగాయన్నమాట. ఇలా అదనంగా జరిగే పనులకు నిధులు పొందే అవకాశం లేదని ఉపాధి హామీ వర్గాలే చెబుతున్నాయి. కోవిడ్,లాక్ డౌన్ సందర్భంలో గత ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో 2020-21 బడ్జెట్లో కేంద్రం ఉపాధి హామీ పథకానికి 1.11 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి 11 కోట్ల మంది కూలీలకు పనులు కల్పించింది. ఆ మరుసటి ఏడాది కోవిడ్ తగ్గడంతో 2021-22 బడ్జెట్లో 73 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.
ఈ నిధులు ఖర్చయితే ఆ తర్వాత అదనపు బడ్జెట్ కేటాయిస్తామని కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్రాలు తమ సొంత నిధులు అడ్వాన్స్ గా చెల్లించి పనులు చేపడితే కూలీలకు పనులు దొరికి కుటుంబాలు నిలబడతాయి. కేంద్రం నిధులు ఇచ్చిన తర్వాత తాము చేసిన ఖర్చులను రియంబర్స్ చేసుకునే అవకాశం ఎలాగూ రాష్ట్రాలకు ఉంటుంది. దీంతో ఉపాధి కూలీలకు రానున్నది గడ్డుకాలమే అనే ఆందోళన మొదలైంది. నెలనెలా పథకాలు, ఉద్యోగుల జీతాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంత కటకట లో ఉపాధి కూలీలకు వేతనాలు సర్దుబాటు చేసే అవకాశం దాదాపు లేనట్టే.