దేశ రాజధాని హస్తినపురి కేంద్రంగా ఆంధ్రా రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ, వైసీపీ నువ్వెంత అంటే నువ్వెంత అని తలపడు తున్నాయి. మంచి రాజకీయాలేవో, చెడ్డ రాజకీయాలేవో ప్రజలను తేల్చుకోనీయక కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. తమ రాష్ట్ర కార్యాలయంపై జగన్ అభిమానులు దాడి చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. ఇదే సందర్భంగా వివిధ వర్గాలను కలుసుకుని తమ బాధను చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ పెద్దలు కూడా ఢిల్లీకే చేరుకుని తన గోడు వినిపించేందుకు సమయాత్తం అవుతోంది. ఎన్నడూ లేనిది రెండు పార్టీలూ ప్రజల సమస్యలపై కాకుండా వ్యక్తిగత సమస్యలను అడ్రస్ చేస్తున్నాయి. పైకి ఇవి ప్రజా సమస్యలు మాదిరిగా ఉన్నా లోపల అంతా వ్యక్తిగత స్వార్థం అన్నది నిండిపోయి ఉంది.
ఈ తరుణంలో ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న రాజకీయాలలో గెలుపు ఎవరిది అన్న మాట ఒకటి వినిపిస్తుంది. పంతం ఎలా ఉన్నా , బలాబలాలు ఎలా ఉన్నా జగన్ పై చంద్రబాబు గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. పాత స్నేహాలను పునరుద్ధరించేం దుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం జగన్ వైపే అని వకాల్తా పుచ్చుకునేందుకు నేరుగా సిద్ధంగా లేకపోవడం విశేషం. ఇదే సందర్భంలో గతం కన్నా ఇప్పుడు బీజేపీకి వైసీపీ అవసరం ఉంది కనుక పైకి ఏమీ చెప్పలేకున్నా అవసరార్థం ప్రేమ, స్నేహం ప్రకటించాలని అనుకుంటోంది.
మరోవైపు బాబుకు కూడా నో చెప్పకుండా కథ నడుపుకుని వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఒకప్పటి కన్నా ఇప్పుడు మోడీ ఛార్మింగ్ జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ బాగా తగ్గిపోయింది. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీల అవసరాలు తీర్చే స్థాయికి బీజేపీ ఎదగవచ్చు. లేదా ఆ స్థాయిలో రాజకీయం నడపనూ వచ్చు. ఆర్థిక సంబంధ ప్రోత్సాహం లేదా సహకారం గత ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ చేసిన సంగతి గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఎటువైపు మొగ్గు చూపాలో తేల్చుకోకుండా ఇరు పార్టీల మాట వింటోంది లేదా వింటున్న విధంగా నటిస్తోంది. కనుక కొద్దికాలం బీజేపీ దగ్గర జగన్ హీరో కావొచ్చు. లేదా ఇప్పటికిప్పుడు చంద్రబాబును హీరో చేసి బీజేపీ కావాల్సినంత లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేయనూ వచ్చు. ఏదేమైనప్పటికీ సానుభూతి రాజకీయాల పరంగా చూస్తే బాబునే హీరో.. తిట్ల రాజకీయం పరంగా చూస్తే వైసీపీనే హీరో