గంజాయి పాపం అందరిదీ!
ఊరికే అలా తిట్టుకోకండి. ఊరికే అలా ఒకరినొకరు చూసి నొసలు చిట్లించుకోకండి. ఊరికే అలా ఒకరినొకరు చూసి కళ్లెర్రగించకండి. ఏం మారదు..ఏం జరిగిపోదు. విశాఖ మన్యం కేంద్రంగా గంజాయి సాగవుతోంది. ఆ సాగుకు సంబంధించిన సమాచారం అంతా పోలీసులు దగ్గరే ఉంది. కొందరు స్థానిక నాయకుల ఒత్తిళ్ల కారణంగా తామేం చేయలేకపోతున్నామని గతంలో పోలీసులే చెప్పారు. కొన్ని సందర్భాల్లో అడవిలో ఉండే మావోయిస్టులు కూడా గంజాయి సాగు వద్దనే చెప్పారన్న వార్తలు వచ్చాయి. ఇవి ఎలా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఆంధ్రాలోనూ గంజాయి సాగు యథేచ్ఛగా సాగిపోతోంది. ఎవ్వరూ ఆపలేనప్పుడు ఒకరిపై ఒకరు ఎందుకు బురద జల్లుకోవడం. అదే రాజకీయం అంటారా ఏంటి? టీడీపీ హయాంలో కూడా ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి వెళ్లారని ఇదేం కొత్త కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాంటప్పుడు తెలంగాణ పోలీసులు ఇక్కడికి వచ్చి హల్ చల్ చేశారని పట్టాభి లాంటి వారు బాధపడిపోవడం సబబు కాదనే చెబుతున్నారు.
గతంలోనూ ఇప్పుడూ గంజాయి సాగును నియంత్రించకుండా విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలా ఒకరిపై ఒకరు తిట్ల పురాణం అందుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. అదేవిధంగా రాష్ట్రంలో మిగతా విషయాలన్నింటిపైనా ఫోకస్ పెట్టకుండా ఉండేందుకు, గతంలో జరిగిన తప్పిదాలు ఏవీ వెల్లడి కాకుండా ఉండేందుకు కూడా ఇదొక గేమ్ ప్లాన్ అని కూడా ఇంకొందరు అంటున్నారు. చంద్రబాబు హయాంలోనూ గంజాయి సాగు ఉన్నప్పుడు అప్పటి నాయకులు ఎందుకని నిలువరించలేకపోయా రు? అప్పుడే కాదు విభజన కాకముందు కూడా అక్కడ గంజాయి సాగు అవుతూనే ఉంది. అంటే ఇన్నేళ్ల కాలంలో పాలకులకు అస్సలు తెలివి రానే రాలేదన్న మాట. లేదా నిద్ర నటిస్తూ పోతున్నారన్న మాట! బాగుంది ఈ పాటి దానికి ఒకరిపై ఒకరు తిట్టుకుని ఏం సాధిస్తారని? అధికారంలోకి రావాలన్న దాహం తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న తలంపు నాయకులకు ఉంటే గంజాయి సాగు, రవాణా అన్నవి ఎప్పుడో ఆగిపోయేవే!