జగన్ ఇలాకా : లోకేశ్ పోరాటం బాగుంది కానీ..?
చంద్రబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో ఎన్నో ఒప్పందాలు జరిగాయి. నేరుగా తండ్రి నుంచి అధికార మార్పిడి జరగకపోయినా తనకు తానే సీఎం అని భావించి, కొన్ని సంస్థలతో మాట్లాడే హక్కు లోకేశ్ పొందారు. అదేవిధంగా కింది స్థాయి అధికారులను ముప్ప తిప్పలు పెట్టారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న జనం ఆయనను తిరస్కరించారు. అప్పట్లో కార్యకర్తలంటే పెద్దగా పట్టించుకోని లోకేశ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు.
కార్యకర్తలకు కష్టం అంటే పరుగులు తీస్తున్నారు. వారి కోసం అండగా ఉండాలని పరితపిస్తున్నారు. వారికి గాయాలైతే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవేళ కోర్టు కేసులు ఉంటే అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. అవసరం అనుకుంటే ఆర్థికంగా కూడా వారిని ఆదుకునేందుకు సిద్ధం అని చెబుతూ వస్తున్నారు. ఏంటీ మార్పు? ఎందుకీ మార్పు? అధికారం లేకపోతే మనుషులు ఇంతగా మారిపోయి ప్రజలను అర్థం చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారా?
అధికారంలో ఉన్నంత కాలం లోకేశ్ ఎన్నో తప్పిదాలు చేశారు. తన వారిని ప్రోత్సహిస్తూ, అధికారులను నానా తిప్పలూ పెట్టారు. రెండో ముఖ్యమంత్రి తానే అన్న భావనలో కొంత కాదు చాలా ఎక్కువగానే కొందరిని అవమానించారు. ఏపీ సెక్రటేరియట్ లో తన మాటకు తిరుగే లేదన్న విధంగా ప్రవర్తించారు. ఆయన ప్రవర్తన కారణంగా చంద్రబాబు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా కొన్ని పనుల విషయమై సెక్రటేరియట్ కేంద్రంగా లోకేశ్ నడిపిన లాబీయింగ్ అప్పట్లో పెను సంచలనం అయింది. లోకేశ్ తో పాటు ఇంకొందరు అదే పనిగా అధికారులను తీవ్ర ఒత్తిడిలో ఉంచేశారు. ఇవన్నీ అధికారం కోల్పోయాక కానీ లోకేశ్ కు అర్థం కాలేదు. అధికారంలో ఉన్నంత కాలం ఎవ్వరి మాట వినడు సీతయ్య అన్న రేంజ్ లో ప్రవర్తించి తరువాత మారిపోయిన మనిషి మాదిరిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం తగదని వైసీపీ అంటోంది.