కేసీఆర్ కూ ముందస్తు భయం!
వచ్చే కాలం ఎలా ఉన్నా ముందు ఒక ఆశ అంటూ మనిషిలో ఉంటుంది. అదే విధంగా వచ్చే కాలం ఎలాంటి సవాళ్లు ఇచ్చినా మున్ముందుకు వెళ్లాలన్న, అడుగు వేయాలన్న ఆలోచన ప్రతి పాదిత స్వరంలో ఉంటుంది. కేసీఆర్ మాత్రం ఇందుకు తాను భిన్నం అంటున్నారు. ముందస్తుకు పోయేదే లేదు అని తేల్చేశారు. అదేవిధంగా ఇంకా బాగా పనిచేయాలని శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఎందుకీ భయాలు..ఏమిటీ ఆందోళనలు అంటే..గతంలో కంటే ఇప్పుడు గులాబీ దండు అంత బాగా లేదన్న వాదన ఒకటి వస్తోంది. హుజురాబాద్ ఫలితం ఎలా ఉన్నా దానిని పట్టించుకునే తీరిక తనకు లేదన్న స్పష్టమయిన సంకేతం ఒకటి ఇవ్వాలన్న ఆశతో ఉన్నారు కేసీఆర్. ఒకవేళ ఈటెల గెలిస్తే పార్టీలో, ప్రభుత్వంలో స్థాన చలనాలు ఉండనున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ముందస్తుకు పోవడం అన్నది అంత మంచిది కాదన్న వాదన ఉంది. రెండు సార్లు వరుస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ బాస్ అనుకున్నంతగా ప్రణాళికలు ఏవీ అమలు చేయలేకపోతున్నారన్న వాదన ఉంది. ముఖ్యంగా ఆయన కలల పుత్రిక దళిత బంధు మొదలుకుని ఇంకొన్ని మంచి కార్యక్రమాలకు అధికారుల సహాయ సహకారాలు చాలా అవసరం. కానీ క్షేత్ర స్థాయిలో అమలు బాలేదు. ఇప్పటికిప్పుడు ఎలాంటి వ్యూహాలూ లేకుండానే వెళ్తే నష్టమే!
ఒకవేళ జగన్ ముందస్తుకు పోయినా కేసీఆర్ మాత్రం వెనుకడుగే వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణ డెవలప్ మెంట్ అన్నది పెద్దగా లేదన్నది ఏడేళ్లుగా వినిపిస్తున్న మాట. ఎంపిక చేసిన నగరాల్లో వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఆశించిన ప్రగతి అందుకోలేకపోయా యి. యాదాద్రిని చూపి ఓట్లు అడగలేరు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదనల దశల్లోనే ఉన్నాయి. ఈ సమయంలో ముందస్తుకు పోతే అభివృద్ధికి సంబంధించి మాట్లాడడానికి ఏం లేదన్నది తేటతెల్లం అయిపోతుంది. అందుకే కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు.