ఏపీలో కరెంట్ కోతలు.. ఈ వెతలు ఎన్నాళ్లు..?
అయితే ఈ నెల 14వ తేదీన కరెంట్ కోతలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వివిధ థర్మల్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై వివరాలు సేకరించారు. థర్మల్ కేంద్రాలను పూర్తి కెపాసిటీతో నడించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన బొగ్గును కొనాలనీ.. అందుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు సీఎం జగన్. సింగరేణితో సమన్వయం చేసుకొని 1600మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఇక ఏపీలో విద్యుత్ సంక్షోభానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 40రోజుల ముందే రాష్ట్రాన్ని అలర్ట్ చేసింది. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు బకాయిలను ఏపీ జెన్ కో తక్షణమే చెల్లించాలని సెప్టెంబర్ 2న లేఖ రాసింది. అటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని కొంతమేర అధిగమించడంలో జల విద్యుత్ కీలకంగా మారింది. అది లేకపోయి ఉంటే సమస్య మరింత తీవ్రంగా ఉండేది.
దేశంలో బొగ్గు సంక్షోభం ఏర్పడిన కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే బొగ్గు సరఫరా పెంచేందుకు క్యాప్టీవ్గనుల నుంచి బొగ్గును మళ్లిస్తామని కేంద్రం చెప్పింది. ఒడిశాలోని తాలాబైరా 2, 3గనుల నుంచి ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా ఇప్పటికే ప్రారంభించింది. అయితే దేశంలోని కొన్ని బొగ్గు గనులు మూతపడటం, మరికొన్ని గనులు వరదల్లో ఉండటం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని కేంద్రం తెలిపింది.