హుజురాబాద్ లో గెలుపు కోసం బీజేపీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాలని బిజెపి నిర్ణయించింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఒక రకంగా బిజెపి సర్వశక్తులను ఒడ్డుతుంది. ఈ స్థానంలో విజయం సాధించి తెరాసను దెబ్బతీయాలని కమలదళం భావిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసం బీజేపీ రాష్ట్ర కమిటీ అన్ని వ్యూహాలను అమలు చేయనుంది. బిజెపి అగ్రనేతలు ప్రచారానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
సామాజిక వర్గాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించింది బిజెపి నాయకత్వం. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు, మున్సిపాలిటీలు, మండలాలకు ఇన్చార్జి బాధ్యతలను కమలదళం అప్పగించింది. ఇక పోలింగ్ కేంద్రాల వారీగా కూడా బాధ్యతలను అప్పగించనున్నారు. పార్టీ సీనియర్లు, రాష్ట్ర స్థాయి నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఓటర్లను తమ వైపు ఎలా తిప్పుకోవాలనే ఈ విషయమై బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అప్పగించారు. హుజురాబాద్ టౌన్ కు రఘునందన్ రావు, హుజూరాబాద్ రూరల్ కి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట రూరల్ కి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జమ్మికుంట టౌన్ కి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఇల్లందకుంట కు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, కమలాపూర్ కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వీణవంక కు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి లను బిజెపి నాయకత్వం బాధ్యతలను అప్పగించింది.
కరోణ నేపద్యంలో భారీ బహిరంగ సభలు,రోడ్ షోలపై ఈసీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా బిజెపి నాయకత్వం ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. దసరా తర్వాత బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హుజురాబాద్ అసెంబ్లీ స్థానం లో ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. వారం రోజుల క్రితమే ఆయన తొలివిడత పాదయాత్ర ను పూర్తి చేశారు . అలాగే కీలక నేతలు రంగంలోకి దిగనున్నారు.