పవన్ పవర్ : శ్రీకాకుళం రోడ్లు మహర్దశ పడతాయా?

RATNA KISHORE
రెండు కిలోమీట‌ర్ల దారికి నిధులు ఇవ్వ‌లేని దుఃస్థితిలో వైసీపీ స‌ర్కారు ఉంది అన్న‌ది కాద‌న‌లేని నిజం. ఇందుకు కార‌ణాలేవ‌యి నా సొంత మ‌నుషులు సైతం కాంట్రాక్టులు తీసుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డం కాద‌నలేని నిజం. అయిన‌ప్ప‌టికీ తాము రోడ్ల ప‌నులు చేప‌డతామ‌ని, త్వ‌ర‌లోనే ఎవ్వ‌రూ ఊహించని విధంగా వాటి గ‌తి మారుస్తామ‌ని వైసీపీ చెబుతున్న‌ది. మ‌రోవైపు వివాదాస్ప‌ద ఆమ‌దాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సైనికులు రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి శ్ర‌మ‌దాన కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు. వీటిపై వైసీపీ అధినేత‌ల్లో ఒక‌రైన స‌జ్జ‌ల రామకృష్ణా రెడ్డి త‌క్కువ చేసి మాట్లాడ‌డం మాత్రం త‌గ‌ద‌ని శ్రీ‌కాకుళం జ‌న‌సైనికులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌మ నిర‌స‌న‌ల‌లో తీవ్ర‌త‌ను అర్థం చేసుకోకుండా మాట్లాడ‌డం త‌గ‌ద‌ని కూడా చెబుతున్నారు. శ్రీ‌కాకుళం రోడ్ల‌పై ఇప్ప‌టికీ ప్ర‌యాణించ‌లేని దుర‌వ‌స్థ త‌మ‌కు ఉంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. కోట్ల రూపాయ‌ల నిధులు సంక్షేమానికి ఖ‌ర్చుచేసి, ఇదేంట‌ని అడిగిన‌వారిని తిట్టిన తిట్ట‌కుండా తిట్ట‌డం స‌బ‌బు కాద‌ని అంటున్నారు. చాలా గ్రామాల్లో రోడ్లు అస్త‌వ్య‌స్తంగా ఉన్నాయ‌ని, ముఖ్యంగా గిరిజ‌న తండాల్లో అస్స‌లు రోడ్లే లేవ‌ని, వీటిపై మాట్లాడ‌కుండా, అవ‌స్థ‌లు తీర్చ‌కుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ముందుకు ఎలా వెళ్ల‌గ‌ల‌ర‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.


గులాబ్ తుఫాన్ కారణంగా చాలా రోడ్లు శ్రీకాకుళంలాంటి ప్రాంతాలలో నామరూపాల్లేకుండా పోయాయి. భారీ వృక్షాలు నేల కూలడంతో అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు కూడా ఇంకా దీనావస్థకు  చేరుకున్నాయి. కొన్ని చోట్ల కొద్దో గొప్పో పనులు చేసి రహదారిని పునరుద్ధరించినా అదంతా తాత్కాలికమే అని తేలిపోయింది. శాశ్వత ప్రాతిపదికన రోడ్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 
జనసేన చేపట్టిన శ్రమదానం ఫలితంగా ఎటువంటి మార్పులు రానున్నాయి? ఇవే పనులు రేపు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? రహదారి నిర్వహణ, భద్రత అన్నవి ఓ ప్రభుత్వం  బాధ్యతగాఎందుకు పరిగణించడం లేదు? ఈ తరహా ప్రశ్నలు కొన్ని వినిపిస్తున్నాయి క్షేత్ర స్థాయిలో! అయితే వీటికి పరిష్కారం ఎవరు ఇస్తారు అన్నది ఆసక్తిదాయకం. జగన్ ఉన్నపళాన నిధులు ఇవ్వలేని అగమ్యగోచర స్థితిలో ఉన్నప్పుడు ఆయన వీటికి పరిష్కారం ఇస్తారని ఎలా అనుకోగలం. పోనీ అక్టోబర్ లో పనులు చేపట్టారే అనుకుందాం కేవలం అవి మరమ్మతులకే పరిమితం అవుతాయా లేదా కొత్త రోడ్ల ఏర్పాటుకు జగన్ ఇచ్చిన నిధులు సహకరిస్తాయా అన్నది కూడా ఇప్పుడు వినిపిస్తున్న వాదన. వానలు పూర్తిగా రోడ్లను ఛిద్రం చేశాయి. గులాబ్ తుఫాను కారణంగా గ్రామీణ రహదారులు అన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. తక్షణ సాయం అందిస్తామన్న కేంద్రం ఇందాక స్పందించిన దాఖలాలే లేవు. అలాంటప్పుడు శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతాలకు సంబంధించి రోడ్లకు మహర్దశ ఎలా వస్తుందని?

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: