కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ అడ్డాపెట్టిన మంత్రి హరీశ్ రావు.. మందుసీసాలతో గ్రామాల్లో విందు రాజకీయాలు చేస్తున్నారని..ఆరోపించారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కొనాలని హరీశ్ రావు ప్రయత్నిస్తున్నాడని... టీఆర్‌ఎస్ కు వెళ్లే వారు అమ్ముడు పోవడం లేదు... కేవలం వాళ్ల దగ్గర నటిస్తున్నారంతేనని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ గడ్డమీద ప్రజలను కొనగలిగే శక్తి కేసీఆర్, హరీశ్ రావుకు కాదు కదా.. వాళ్ల జేజెమ్మకు కూడా లేదని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.
దళిత బంధు అందుకునే ఓ బిడ్డ.. తనకు డబ్బులొద్దు ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరాడని... తన ఆరాటం, పోరాటం.. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ కోసమన్నారు. పావలావడ్డి రుణాలు రావాలంటే మీటింగ్ కు రావాలని మహిళలపై ఒత్తిడి తెస్తున్నారని... టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని మహిళా సంఘాల నాయకులతో ప్రచారం చేయించుకుంటున్నారని నిప్పులు చెరిగారు. డబ్బులు కొరతలేదని చెబుతున్న సీఎం.. నాలుగేళ్లుగా ఎందుకు రుణాలు ఇవ్వలేదన్నారు ఈటల రాజేందర్.
హుజురాబాద్ అడబిడ్డలకు ఇచ్చినట్లుగానే.. తెలంగాణలోని మహిళలందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొర్రెలు, ఆలయాల నిర్మాణాలు, రోడ్లు.. అడగగానే ఇస్తున్నారంటే.. దాని వెనక తనను ఓడించాలనే కుట్ర ఉందని... వాళ్లు వెళ్లగొట్టేదాకా తాను టీఆర్‌ఎస్ పార్టీలో 18 ఏళ్లు ఉన్నానన్నారు. ఓ మామాలు వ్యక్తిని తన మీద పోటీ పెట్టి.. తనను ఓడిగొట్టి చూపిస్తారట... కానీ అది జరగని పని అని స్పష్టం చేశారు. తాను సీఎం పదవి కోసం పోటీ పడలేదని... కానీ ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నిలుపుకోమని అడిగానన్నారు. తెలంగాణ వచ్చింది దేని కోసం ? ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో కాదా ? అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. టీఆర్‌ఎస్ కు డిపాజిట్ రాకుండా.. తీర్పునిస్తారని తాను నమ్ముతున్నాన్నట్టు పేర్కొన్నారు. బీజేపీ పార్టీని గెలిపిస్తే.. అభివృద్ధి జరుగుతుందన్నారు ఈటల రాజేందర్.