నానీ ఇలాకాలో వంగవీటి రాజకీయం ?
ఇద్దరు స్నేహితులు విడిపోవడం అన్నది ఎప్పుడూ జరగదు. కేవలం దూరంగా ఉండడం అన్నదే ఉంటుంది. మరి! రాజకీయంలో కూడా రెండు వేర్వేరు పార్టీలలో నేతలున్నా వారు ఎన్నడూ ఎక్కడో ఓ చోట కలుసుకుంటారు. మాట్లాడుకుంటారు. కుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తుంటారు. ఆ కోవలో నిన్నటి దాకా కొడాలి నానీ, వంగవీటి రాదా? ఇప్పుడేమయ్యారు? ఏమయిపోయింది వారి స్నేహం. ఇంతకీ వారిద్దరి దోస్తీ ఎప్పుడు మళ్లీ ?
గుడివాడ పాలిటిక్స్ విభిన్నంగా ఉంటాయి. కొడాలి నాని పేరిట రాజకీయం ఇంకా విభిన్నం. ఎవ్వరిపైన అయినా వెనుకా ముందు చూడకుండా విరుచుకుపడే నానీ రాజకీయం వైసీపీకి జోష్ ఇచ్చినా, రాష్ట్ర ప్రజలకు మాత్రం అంతగా నచ్చలేదనే చెప్పాలి. రాజకీ యాల్లో భాష ఒక్కటే ప్రాధాన్యం అని చెప్పలేం కానీ అది ప్రామాణికం అని చెప్పగలం. ఈ లెక్కన నాని భాషపై వేరేగా ఏం మాట్లాడ లేం. ఇప్పుడు నానీ రాజకీయంలోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. అతడే వంగవీటి రాధ. ఇద్దరూ మంచి స్నేహితులే అయినప్పటికీ చాలా రోజులుగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలపరుస్తూ గుడివాడ క్యాంపు రాజకీయాల్లో రాధా తరుచూ ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తోంది. నానీ నియోజకవర్గంపై రాధాకు ఎందుకింత ప్రేమ?
వాస్తవానికి కాపు సామాజిక వర్గ నేతగా విపరీతం అయిన పేరున్న కుటుంబం వంగవీటి రంగా. రంగా కుటుంబం నుంచి వచ్చిన రాధా పలుసార్లు రాజకీయంగా తప్పులు చేశారన్న ఘటనలు ఉన్నాయి. పలు పార్టీలు మారిన ఘటనలూ ఉన్నాయి. విజయ వాడ పాలిటిక్స్ ను శాసించే సత్తా ఉన్న కుటుంబాల్లో రంగా ఎంతో నానీ కూడా అంతే! కానీ ఇప్పుడు రాధా కన్ను గుడివాడపై పడింది. తరుచూ ఆయన అటుగా వెళ్తున్నారు. కాపు సామాజికవర్గ నేతలతో సమావే శం అవుతున్నారు. నానీ ప్రవర్తన తీరు కారణంగానే కాపు సామాజికవర్గ పెద్దలు రాధాకు దగ్గరవుతున్నారని తెలుస్తోంది. ఇవి ఏ పరిణామాలకు దారితీస్తాయో?
చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న నేతగా రాధా పేరు రాజకీయాల్లో వినపడుతోంది. తండ్రి స్థాయిలో పేరు తెచ్చుకోలేక, ఆయనంతటి నాయకుడు కాలేక రాధా ఏనాటి నుంచో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వరుస ఎన్నికల్లో ఆయన తప్పిదాలే ఓటమికి కారణం అయి ఉన్నాయి. 2004 మినహా తరువాత ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టింది లేదు. మొదట కాంగ్రెస్, తరువాత పీఆర్పీ, తరువాత వైసీపీలో చేరాక ఎందులోనూ ఇమడలేక ఆఖరికి టీడీపీ గూటికి చేరారు. కొంత కాలం జనసేనకు వెళ్తారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ ను వదిలి ఎందుకని గుడివాడలో అడుగుపెడుతున్నారో అన్నది ఎవరికీ అంతుపోలడం లేదు.