శ్రీకాకుళం వార్త : జగన్ కు దగ్గరగా ముగ్గురు నేతలు? ఎవరు ? ఎందుకు?
పిరియా సాయి రాజు ఒక సారి గెలిచాడు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓడిపోయాడు. దువ్వాడ శ్రీను రెండు సార్లు అచ్చెన్న చేతిలో ఓడిపోయాడు. సీతారాం వరుస ఓటములతో ఉన్నాడు అప్పటిదాకా. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఇదే ఆఖరి యుద్ధం అని బరిలోకి దిగి అల్లుడు కూనపై గెలుపొందారు. వీరిలో దువ్వాడ శ్రీను, సీతారాం కొంతకాలం పీఆర్పీలో తిరిగారు. శ్రీను ఆ మధ్య జనసేనకు వెళ్తారన్న టాక్ కూడా నడిచింది. ఆఖరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారని చెబుతారు ఆయన అభిమానులు. పిరియా సాయిరాజు ఇచ్ఛాపురం నేతకాగా, సీతారాం ఆమదాలవలస నియోజవర్గంకు, దువ్వాడ శ్రీను టెక్కలి నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీటిలో ఇచ్ఛాపురం, టెక్కలి వాణిజ్యపరంగా జిల్లాకు ఎంతో పేరున్న ప్రాంతాలు కాగా, ఆమదాలవలస ఇప్పటికీ ఎటువంటి అభివృద్ధినీ పొందలేక, పాలకుల కొట్లాటలో నలిగిపోతూ ఉంది. ఇక్కడే శ్రీకాకుళం స్టేషన్ ఉంది, అయినప్పటికీ దీని వల్ల జిల్లా వాసులకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు.
ఇక జగన్ ను నమ్ముకుని సీతారాం వైసీపీలోకి చేరారు. గెలిచాక స్పీకర్ అయ్యారు. ఆయన ఊహించని ఫలితం ఇది. దీంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు ఆయన భార్య వాణీ సీతారాం. ఆ ఇంట రాజకీయాలను నడిపేది ఆమెనే కనుక ఇక సీతారాం పాత వివాదాల్లో కొత్తగా ఇరుక్కుపోయారు. దువ్వాడ శ్రీను ను కూడా నడిపేది వాణీ మేడమ్. ఆమె జెడ్పీటీసీగా ఇప్పుడు ఎన్నికయ్యారు. టెక్కలిలో అచ్చెన్న కు గట్టి సమాధానం ఇచ్చారు. ఈమె కూడా టెక్కలి తదితర ప్రాంతాలపై మంచి పట్టున్న నేత. దువ్వాడ శ్రీను స్పీడును నియంత్రిస్తూ, టెక్కలిలో పార్టీనీ ఇంటినీ చక్కదిద్దే నేత. గ్రానైట్ వ్యాపారాలు ఉన్నా అచ్చెన్న దెబ్బతో అవన్నీ మూసుకుపోయాయి అని సమాచారం.
మరొక నేత పిరియా సాయిరాజు ఈయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్ఛాపురం వైసీపీ టికెట్ తీసుకుని పోటీచేసినప్పటికీ ఓడిపోయారు. కానీ జగన్ మాత్రం ఆయనకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. ఇకపై ఇస్తారు కూడా! ఆయన భార్య పిరియా విజయ (కవిటి జెడ్పీటీసీ) కే జెడ్పీ పీఠం దక్కనుంది. ఈ విధంగా జిల్లా రాజకీయాల్లో కాళింగసామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు జగన్ చేసిన ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అయింది. కాళింగుల తో పాటు వెలమ సామాజికవర్గం ఉన్నా శ్రీకాకుళం,నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం ఉన్నా జగన్ కాళింగ, కాపు సామాజికవర్గాలను చాలా చేరువ చేసుకున్నారు అన్నది నిజం. కాపు సామాజికవర్గం తరఫున ప్రాబల్యం రాజాం, ఎచ్చెర్ల, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో ఉంది. కానీ రెడ్డి శాంతి (పాతపట్నం ఎమ్మెల్యే) కోరుకున్న పదవి ఏదీ దక్కలేదు. ఇక జిల్లాకు చెందిన ఎస్టీ నియోజకవర్గం పాలకొండకు కానీ, ఎస్సీ రిజర్వుడు స్థానంగా చెప్పుకునే రాజాం నియోజకవర్గంకు కానీ జగన్ పదవుల పరంగా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు అనే చెప్పాలి.