శ్రీకాకుళం వార్త : గర్భిణిని ఆదుకున్న ప్రభాస్ ఫ్యాన్స్
అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఆ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఎవరికి చెప్పాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. అప్పటికప్పుడు కొన్ని అంబులెన్స్ సర్వీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె అన్నయ్య ప్రభాస్ ఫ్యాన్స్ నిర్వహిస్తున్న అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. వెంటనే ఆమె ఇంటికి అంబులెన్స్ చేరుకుంది.
సురక్షితంగా ఆస్పత్రికి చేర్చింది. తరువాత తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమం అన్న వార్త విని ఆనందం పొందండం ఆ అభిమానుల వంతైంది. అలా అని వీరేమీ పెద్దగా డబ్బున్న వారేమీ కాదు ఆటో నడుపుకుంటూ కుటుంబాలను పోషించే వీళ్లు ఇన్ని మంచి పనులు చేస్తున్నారంటే ఊళ్లో మా ఊళ్లో అందరికీ ఆనందమే! ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు సూర్య ఓ ఆటోవాలా. ఆయనకు పెద్దగా ఆదాయం ఏమీ ఉండదు. దాతల సహకారంతో ఎందరికో అన్నం పెట్టే పనులు చేస్తున్నాడు. మార్చురీ నిర్వహించే సేవకులకు వీలున్నంత వరకూ సాయం అందిస్తున్నాడు. కరోనా సమయంలో కూడా ఇలానే కొన్ని మంచి పనులు చేసి అందరి మన్ననలూ అందుకున్నాడు.
ఇంకా చెప్పాలంటే.......
సినీ అభిమానులందరిలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు సూర్య ఆధ్వర్యంలో పేదలకు అన్నం పెట్టేందుకు ప్రతి రోజూ రెండు పూటలా వారి ఆకలి తీర్చేందుకు ప్రధాన కూడళ్లలో రెండు ఫుడ్ కోర్టులు ఏర్పాటు అయ్యాయి. అదేవిధంగా పేదలు ఎవరయినా చనిపోతే వారిని స్మశాన వాటికకు తరలించేందుకు ప్రత్యేక కైవల్య రథం ఒక టి నడుపుతున్నారు. సత్యసాయి సంస్థల సమన్వయంతో ఈ సేవలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు అంబులెన్స్ సేవలను అం దుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఓ గర్భిణిని ఆదుకుని మానవత్వం చాటారు.
మా చెల్లి ప్రాణం నిలబెట్టాడు : లాల్ ప్రసాద్ దాకోజు
ఆర్టిస్టు ను నేను. కొన్ని స్కెచ్చులు వేశాను. ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇష్టం. ఇటీవలే పుష్ప షూటింగ్ లో భాగంగా నేను కొంత ఆర్ట్ వర్క్ చేశాను. ఇవన్నీ అటుంచితే నా చెల్లి మానస నిండు గర్భిణి. మేం శ్రీకాకుళం నగరం, గైనేటి వీధిలో ఉంటాం. మా చెల్లికి ఉన్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. ఎన్నో నంబర్లకు ట్రై చేశాను కానీ లాభం లేకుండా పోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణకు కాల్ చేయగానే వెంటనే మేమున్న చోటికి అంబులెన్స్ వచ్చింది. వెంటవెంటనే ఓ ప్రయివేటు ఆస్పత్రికి చేర్చింది. మా చెల్లి ప్రాణం కాపాడింది. ఇప్పుడు తను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మేం ఎంతో ఆనందంగా ఉన్నాం. థాంక్ యూ ప్రభాస్ సూర్య.