విశాఖ షాక్ ఇచ్చేస్తే ఎలా... ?

Satya
విశాఖ ఏపీలోనే అతి పెద్ద నగరం. రాజధాని హోదా ఉంది. రాజసం ఉంది, కానీ లక్ మాత్రం సరిగ్గా లేదు. అందుకే విశాఖ అలా ఉండిపోయింది. అయితే విశాఖ అంటే తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలో కూడా అందరికీ తెలుసు. అక్కడ ఏ పరిణామం జరిగినా కూడా అది బాగా ప్రచారం అవుతుంది.
విశాఖ రాజకీయంగా కూడా బాగా ముందున్న నగరం. అక్కడ జనాలు తమ తీర్పుని తెలివిగా ఇస్తారు అని చెబుతారు. విశాఖ తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి ఆ పార్టీకే పట్టం కడుతూ వస్తోంది. టీడీపీ జెండా ఎపుడూ ఎగురుతూ వస్తోంది కూడా. 2019 ఎన్నికల్లో కూడా విశాఖ సిటీలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ పరం అయ్యాయి. అలాంటి విశాఖ ఎందుకో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది. విశాఖ రాజకీయాలు బాగా  మారిపోతున్నాయి. వైసీపీ అధికారంలోకి రావడంతో విశాఖను రాజధానిగా ప్రకటించింది. మూడు రాజధానుల మీద చట్టం కూడా చేసింది. అదిపుడు న్యాయ సమీక్షలో ఉంది.
ఆ తరువాత ఎంతో మంది టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. దాంతో విశాఖలో వైసీపీ మరింతగా స్ట్రాంగ్ అయింది. మార్చిలో జరిగిన జీవీఎంసీ  ఎన్నికల్లో మేయర్ సీటుని కైవశం చేసుకున్న వైసీపీ ఇపుడు విశాఖ  జిల్లా పరిషత్తుని కూడా టాప్ గేర్ మార్చి మరీ  గెలుచుకుంది. దీంతో విశాఖలో రాజకీయం మొత్తం వైసీపీ ఒడిసిపట్టినట్లు అయింది.
మరో వైపు చూస్తే టీడీపీలో నాయకత్వ లేమి కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. పెద్ద జిల్లా అయిన విశాఖలో అన్ని పదవులూ కూడా వైసీపీ చేతిలోనే ఉన్నాయి. దాంతో మొత్తం పాలిటిక్స్ ని తిప్పుతోంది ఫ్యాన్ పార్టీ. ఈ పరిణామాలు సహజంగానే తమ్ముళ్ళలో నైరాశ్యాన్ని కలిగిస్తున్నాయి. నామినేటెడ్ పదవులతో పాటు, స్థానిక ఎన్నికల్లో పదవులు, బీసీ కార్పోరేషన్లు ఇలా చాలా మటుకు వైసీపీ నేతలకు దక్కాయి. దాంతో వైసీపీలో జోష్ కనిపిస్తోంది. అదే టైమ్ లో టీడీపీలో మాత్రం కొంత గందరగోళం ఉంది. మరో రెండున్నరేళ్ళ రాజకీయం ఇలాగే సాగితే టీడీపీకి ఇబ్బందులే అంటున్నారు. మరి సైకిల్ పార్టీ గేర్ మార్చాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీకి కంచుకోట అని చెప్పుకునే విశాఖ పసుపు పార్టీకి గట్టి షాకే ఇచ్చేసింది అని చెప్పకతప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: