'పీకే'స్తారా?: వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం!

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ భయం పట్టుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులు అందరూ వెళ్లాక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులకు ప్రశాంత్‌ కిషోర్‌ బృందం సర్వే విషయం చెప్పగానే వారికి గుండెదడ పెరిగింది. కొందరికి ముచ్చెమటలు పట్టాయి. ఈ విషయం తెలియగానే పార్టీ ఎమ్మెల్యేలలో కలవరం మొదలైంది. గత ఎన్నికల సమయంలో మాదిరిగానే ప్రశాంత్‌ కిషోర్‌ ఎవరి పని తీరు బాగోలేకుంటే.. వారికి పీకేస్తారేమోనన్న భయాందోళన వారిని పట్టి పీడిస్తోంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంకా రెండున్నర సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే అప్పుడే ప్రశాంత్‌ కిషోర్‌ అవసరం ఏమొచ్చింది అనే దానిపై వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం జరుగుతోంది.
అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రశాంత్‌ కిషోర్‌ భయం ఎందుకు అంతగా ఉంది? ముఖ్యమంత్రి నోటి వెంట ప్రశాంత్‌ కిషోర్ పేరు ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ఫ్యాన్‌ ఫ్యాన్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు తప్ప.. అభివృద్ది కార్యక్రమాలను పట్టించుకోని వైసీపీ సర్కారుకి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నిరసనలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రోడ్లకు గుంతలు పడ్డాయి. వీటిని పూడ్చేందుకు, కొత్త రోడ్లు వేసేందుకు కాంట్రాక్టు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించినా బ్యాంకు అధికారులు ముఖం చాటేశారు. దీనికి తోడు రేషన్ కార్డులు, పెన్షన్లు, అనర్హుల పేరిట తొలగిస్తున్నారని, క్షేత్రస్థాయిలో గగ్గోలు పెడుతున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, భూకబ్జాలు, మంత్రి, ఎమ్మెల్యేల రాసలీలలు, వంటి సంఘటనలు ప్రభుత్వానికి మైనస్‌గా, పార్టీ ప్రతిష్టను మసకబారే విధంగా చేశాయని వైసీపీ సీనియర్ నేతలే చెబుతున్నారు.
ఇక ప్రశాంత్‌ కిషోర్‌ బృందం సర్వే పేరుతో మళ్లీ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ గ్రామాలు, పట్టణాలలో వార్డుల బాట పట్టాలనే వ్యూహంతోనే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పీకే బాంబ్‌ విసిరారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు తన భయం లేకపోయినా, కనీసం పీకే టీమ్‌ భయం అయినా ఉంటుందన్నది సీఎం జగన్‌ ఆంతర్యం అయ్యి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: