ఓవర్ టు టీడీపీ : నిరాశ ఎందుకు ? నిరాసక్తి ఎందుకు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎనలేని ఖ్యాతి ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పడంలో సందేహం లేదు. ప్రాంతీయ పార్టీ అయి నా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో తగువుకు దిగి అనుకున్నది సాధించింది. అన్నగారి క్రేజ్ కారణంగా ఎన్నో మంచి ఫలితాలు అందుకుంది. ప్రజలే నా దేవుళ్లు అని చెప్పి, వాడ వాడలా ఆత్మ గౌరవ నినాదాన్ని వినిపించారు. అందుకు తగ్గ విధంగా స్థానిక బీసీ నేతలను ప్రోత్సహించారు. ఇవాళ ఎందరెందరో బీసీ నాయకుల వారసులు తెరపై ఉన్నారంటే అదంతా రామారావు పుణ్యమే! అటుపై వచ్చిన పరిణామాల్లో పార్టీకి ఇంకాస్త క్రమశిక్షణ అందించినవారు బాబు. ఇప్పుడు ఆయన ఎలాఉన్నా సరే అడ్మిన్ స్ట్రేటర్ గా ఆయనకున్న పేరు ఎవ్వరికీ రాదు. రాజశేఖర్ రెడ్డి కూడా అధికారులపై పట్టు సాధించలేకపోయారు. వారిని కేవలం సొంత పనులకే పరిమితం చేసి విమర్శలు, వివాదాల పాలయ్యారు.
ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు మాత్రం పాలన దక్షతలో ఎంతో పేరు తెచ్చుకున్నారు.కానీ ఇప్పుడు గతం అయిపోయింది. అమరా వతిపై ఆయన పెంచుకున్న అతి ప్రేమ కారణంగా గత ఎన్నికల్లో ఆయన సాధించింది ఏమీ లేదు. కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యారు. అయినప్పటికీ ప్రజా గొంతు వినిపించే నేతలున్నప్ప టికీ టీడీపీ ఇప్పటి స్థానిక పోరును పెద్దగా పట్టించుకోలేదు. పోరు చేయక ముందే అస్త్ర సన్యాసం చేయడం ఒక తప్పిదం అయితే, ఫలితాలను సైతం విశ్లేషించకుండా కనీసం వాటిని అర్థం చేసుకోకుండా స్థానిక నాయకత్వాలు ఉండడం విచారకరం. ఎంత లేదన్నా రేపటి వేళ ఏర్పాటయ్యే స్థానిక నాయకత్వాలను జెడ్పీ చైర్మన్లను, ఎంపీపీలనూ నిలదీయాలి కదా! అలా చేయాలి అంటే వారి నేపథ్యం, వారి గెలుపునకు సహకరించిన అంశాలు ఇవన్నీ తెలుసుకోవాలి. మేం పట్టించుకోలేదు ఈ ఎన్నికలను అంటే అది తగని మాట. తప్పించుకునే మాట. అలా చేయడం వల్ల పార్టీకి పరువు తక్కువ కూడా!