శ్రీకాకుళం వార్త : జెడ్పీ పీఠం ఎంపికపై కుల వివాదం?
జెడ్పీ ఎన్నికల ఫలితాలు ఇంకా తేలనే లేదు. అప్పుడే కుల వివాదాలు, డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో జెడ్పీ పీఠం గత ఎన్నికల సమయంలో కాళింగులను వరించింది. అంతకుమునుపు కాపు సామాజికవర్గాన్ని వరించింది.
ఈ సారి మాత్రం పీఠం కేటాయింపుపై అప్పుడే స్పష్టత రావడం లేదు. కాళింగ, కాపు సామాజిక వర్గాలే జిల్లాలో మొదటి నుంచి బాగా ప్రభావ వంతంగా రాజకీయాలు చేస్తున్నాయి. వీరి తో పాటు వెలమ సామాజికవర్గం తన పట్టు ఎప్పటికప్పుడు నిలుపు కుంటూ వస్తోంది. కాళింగులు ఎక్కువన్న చోట కూడా వెలమ సామాజికవర్గం తన పట్టు చాటుకోవడం అన్నది ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామమే. కానీ కాళింగులను కాదని, తమకు పదవి కేటాయించాలని ఎవ్వరు పట్టుబట్టినా సంబంధిత పార్టీలు చుక్కలు చూడాల్సిందే. ఇదేవిధంగా వెలమలు కూడా తమదైన ప్రభావం చూపుతూనే ఉన్నారు. తాజాగా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా శ్రీకాకుళం జెడ్పీ పీఠం తమ సామాజిక వర్గానికే కేటాయించాలని అఖిల భారతీయ యాదవ మహాసభ డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకూ తమ సామాజిక వర్గానికి రాజకీయంలో ప్రాధాన్యం లేదని వాపోతోంది. పదవుల కేటాయిం పులో ఈ సారి అయినా ము ఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.