గ్రానైట్ అలర్ట్ : మాజీ మంత్రి అచ్చెన్నకు పెను సవాలు?
టీడీపీ ప్రజల సమస్యలపై పోరాడుతున్న దాఖలాలు ఏమీ లేవని తేలిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో కలర్ గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఒకటి నిన్న జరిగింది. కానీ దానిని సైతం అడ్డుకోలేకపోయింది. సారవకోట మండలం బొంతు రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణకు జేసీ విచ్చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న గిరిజనులు హాజరైనప్పటికీ టీడీపీ నుంచి నాయకులు ఎవ్వరూ అక్కడికి వెళ్లలేదు. ఆ మాటకు వస్తే ఎటువంటి నిరసనలూ లేకుండానే కొండ తవ్వకాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ అన్నది సజావుగానే పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో అచ్చెన్న ఫైటింగ్ స్పిరిట్ ఏమయిందని చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి కాస్త దూరంలోనే అచ్చెన్న సొంత నియోజకవర్గం టెక్కలి. అక్కడ కూడా గ్రానైట్ వ్యాపారం ఎన్నాళ్ల నుంచో సాగుతోంది. అయితే ఇక్కడ కూడా కోట్లకు పడగలెత్తిన నేతలు అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ ఉన్నారు కానీ ఇక్కడ స్థానిక వ్యతిరేకత లేదు. ఇప్పుడు చేపట్టనున్న కలర్ గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి స్థానిక వ్యతిరేకత ఉన్నా ప్రజల తరఫున మాట్లాడేవారే లేరు.
మంత్రి దాసన్న ఇలాకాలో గ్రానైట్ తవ్వకాలపై వివాదం నెలకొంది. దీనిపై స్పందించాల్సిన మంత్రి స్పందించడం లేదు. దీంతో వివాదం మరింత ముదిరిపోనుంది. గతంలోనూ గ్రానైట్ తవ్వకాలపై శ్రీకాకుళంలో అనేక సందర్భాల్లో ఉద్యమాలే రేగాయి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంకు ఆశించినంత ప్రతిఘటన అయితే లేదు. టీడీపీ కూడా పెద్దగా మాట్లాడడం లేదు. సారవకోట మండలం, బొంతు రెవెన్యూ పరిధిలో తాజాగా చేపట్టనున్న గ్రానైట్ తవ్వ కా లపై ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఇది సాక్షాత్తూ డిప్యూటీ సీఎం కృష్ణదాసు ఇలాకా.. అయినప్పటికీ టీడీపీ పెద్దగా నోరేసుకు పడిపోవడం లేదు. ఇక్కడ గ్రానైట్ తవ్వకాలు వద్దని గ్రామంలో అరాచకం సృష్టించవద్దని, అప్ప ణంగా ప్రకృతి వనరులు దోచుకుని పోవడం తగదని గిరిజనులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. కానీ గ్రానైట్ తవ్వకాలు జరిగితే స్థానికంగా ఉపాధి వస్తుందని జేసీ సుమిత్ కుమార్ చెబుతున్నారు. ఈ మాటను అయితే గ్రామ ప్రజలు నమ్మేలా లేరు.