బెంగాల్‌పై ఈసీ డేగ కన్ను..!

Podili Ravindranath
దేశ వ్యాప్త ఎన్నికలు ఒక ఎత్తు... పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక ఎత్తు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా 7 విడతల్లో నిర్వహించింది. అయినా సరే... బెంగాల్‌లో ప్రచారం సమయం కానీ, పోలింగ్ రోజు కానీ హింస జరగకుండా నివారించలేకపోయింది. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అల్లర్లు చెలరేగాయి. అధికార పార్టీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు... ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. కేంద్ర మంత్రులను కూడా తరిమి తరిమి కొట్టారు. ఈ హింసలో ఏకంగా పది మంది వరకు మృతి చెందారు. వారిని పరామర్శించేందుకు స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్‌లో పర్యటించారు. రెండు రోజుల పాటు బెంగాల్‌లో ప్రదర్శన కూడా నిర్వహించారు.
ప్రస్తుతం మరోసారి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో 5 నెలల కింద జరిగిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం... ముందే అప్రమత్తమైంది. ఈ నెల 30వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి జరిగే ఉప ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. అటు భారతీయ జనతా పార్టీ కూడా బలమైన పోటీ ఇచ్చేందుకు ప్రియాంక టేబ్రివాల్‌ను బరిలో దింపింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో హింస చెలరేగే అవకాశం ఉందని భావించిన ఈసీ... అక్కడకు ఏకంగా 52 కంపెనీల కేంద్ర బలగాలను పంపేందుకు ప్లానింగ్ చేస్తోంది. ఇప్పటికే 20 కంపెనీలు బెంగాల్‌ చేరుకున్నాయి కూడా.
మమతా పోటీ చేస్తున్న భవానీపూర్‌ నియోజకవర్గంలో ఇప్పటికే రాజకీయ దాడులు మొదలయ్యాయి. భవానీపూర్ నియోజకవర్గం బీజేపీ ఇంఛార్జ్ అర్జున్ సింగ్ ఇంటిపై రెండు సార్లు బాంబు దాడి జరిగింది. దీంతో పోలీసులు కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. వారం రోజుల్లోనే రెండు సార్లు బాంబు దాడి జరగడంతో... ఎంపీ అర్జున్ సింగ్‌ కూడా ప్రాణహాని ఉందని కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ దాడుల వెనుక తృణమూల్ కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దీంతో కేంద్ర బలగాలను ముందే మోహరించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: