బీజేపీ దిద్దుబాటు చర్యలు!

N.Hari
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. వాటన్నింటిని నివృత్తి చేసేందుకు, జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు బీజేపీ హైకమాండ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు ఈనెల 17న నిర్మల్‌లో జరుగనున్న అమిత్‌ షా సభను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17వ నిర్మల్ లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.  ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బీజేపీ కిందిస్థాయి నేతలు, క్యాడర్ లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే విధంగా  అమిత్ షా ప్రసంగం ఉంటోందని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తెలంగాణ బీజేపీ వర్గాలను నిరుత్సాహానికి గురిచేసిన నేపథ్యంలో అమిత్ షా నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కమలనాథులు చెప్తున్నారు.  టీఆర్ఎస్‌తో బీజేపీకి ఎలాంటి దోస్తీ లేదని.. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బలమైన ప్రత్యర్థిగానే బీజేపీ పోరాటం చేస్తోందని బీజేపీ అంటోంది.‌ ఇదే మెసేజ్‌ను అమిత్ షా ద్వారా ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి పంపాలనుకుంటున్నట్లు కమలనాథులు బలంగా భావిస్తున్నారట.
టీఆర్ఎస్, బీజేపీ కి మధ్య రాజకీయంగా హోరాహోరీ నడుస్తోన్న సమయంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన తెలంగాణ ప్రజల్లో పలు అనుమానాలను రేకెత్తించింది.  ప్రధాని మోదీతో పాటు.. పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ వరుసగా భేటీలు కావడం..  హుజూరాబాద్ ఉప ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడడం ఒకేసారి జరిగాయి. దీంతో ఈ అంశం బీజేపీకి శాపంగా మారింది. ఇదే సమయంలో అధికారట టీఆర్ఎస్ కు రాజకీయంగా లాభింవచే అంశం. ఇదే అంశంపై ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతోంది. ‌ కేసీఆర్ ఒత్తిడి మేరకే హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూలు వెలువడలేదన్న  అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్‌తో తెలంగాణ బీజేపీ గట్టిగా పోరాడుతున్నా..‌ ఢిల్లీలో  బీజేపీ నేతలు కేసీఆర్ తో స్నేహంగా ఉండడం..  రాష్ట్ర పథకాలను  కేంద్రమంత్రులు ప్రశంసించటం లాంటివి తెలంగాణ కమలనాధులకు మింగుడుపడడంలేదు. ఈనేపథ్యంలో ఈనెల 17న నిర్మల్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్‌పైన అమిత్ షా ఘాటుగానే విరుచుకుపడే అవకాశం ఉందని బీజేపీ నేతలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: