ఈ మాస్కుల గోల ఎప్పటి వరకో తెలుసా..?

NAGARJUNA NAKKA
కరోనా కారణంగా మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది. అయితే చాలా మంది మాస్కులు పెట్టుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కొందరికి శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఇంకా ఇప్పటి వరకు ఈ మాస్కులు పెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నీతి అయోగ్ సభ్యులు వీకే పాల్ స్పందించారు. 2022వరకు మాస్కులు తప్పనిసరి అన్నారు. దేశంలోపండుగల సీజన్ వల్ల థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కరోనా టీకాలను మారుమూల ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ ద్వీపాలతో పాటు మణిపూర్, నాగాలాండ్ లోని పలు ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను తీసుకెళ్లేలా ఐసీఎమ్ఆర్ కు అనుమతి ఇచ్చింది. గరిష్టంగా 3వేల మీటర్ల ఎత్తులో మాత్రమే ఈ డ్రోన్లను నడపాలని పౌరవిమానయాన శాఖ ఐసీఎమ్ఆర్ కు తెలిపింది. అయితే తెలంగాణలో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ఇటీవలే ప్రారంభమైంది.
ఇక భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ కు ఈ నెలాఖరులోగా డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. కొవాగ్జిన్ పై పూర్తి సమాచారాన్ని భారత్ బయోటెక్ ఇప్పటికే డబ్ల్యూహెచ్ ఓకు సమర్పించింది. ఈ అనుమతి లభిస్తే కొవాగ్జిన్ తీసుకున్న వారు ఏ దేశానికైనా స్వేచ్ఛగా ప్రయాణించే వీలుంటుంది. ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, సినోఫార్మ్, ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాల అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ ఓ ఆమోదం లభించింది.
ఇక దేశంలో కొత్తగా 25వేల 404కరోనా కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా దేశంలో కోరనా బాధితుల సంఖ్య 3కోట్ల 32లక్షల 89వేల 579కు చేరింది. కొత్తగా 339 మంది కరోనా ధాటికి బలవ్వగా.. మరణాల సంఖ్య 4లక్షల 43వేల 213కు పెరిగింది. మరో 37వేల 127 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 3కోట్ల 24లక్షల 84వేల 159కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 62వేల 207 యాక్టివ్ కేసులున్నాయి. అటు దేశంలో ఇప్పటి వరకు 75.22కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: