ఏపీ డ్రగ్ రాకెట్ : రాజకీయ హస్తం ఉందా?
హైద్రాబాద్ నుంచి గుంటూరు వరకూ డ్రగ్ కలకలం రేగుతోంది. కొంచెం ప్రయత్నించి నిఘా పెంచి చూడండి మహా నగరాలు కొన్ని ఈ జాబితాలో చేరడం ఖాయం. వీటి వెనుక ఎవరు ఉన్నారన్నది అత్యంత కీలకం. రాజకీయ శక్తుల ప్రమేయం ఉంటే అందుకు దారి తీసిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేయాలి. అదేవిధంగా కుర్రకారుపై నిఘా ఉంచి, వారి ఆన్లైన్ లావాదేవీలపై నిఘా పెంచాలి. ఇవేవీ చేయకుండా ఈ కేసును కేసులానే చూసి, వదిలేస్తే ఎన్నో నష్టాలు భవిష్యత్ లో చోటుచేసుకోవడం అన్నది సా ధ్యం. ఇక ఈ కేసులో ఎవరున్నారు? ఏ ఏజెంట్ ద్వారా వీరికి డ్రగ్స్ చేరాయి..ఇంజినీరింగ్ కుర్రాళ్లకు డ్రగ్ వాడాల్సిన అవసరం ఏ ముంది? వీరేనా ఇంకెవ్వరయినా ఈ ఘటనకు కారకులా ఇవన్నీ వెలుగులోకి రావాలి. అందుకు గుంటూరు పోలీసులు దర్యా ప్తును వేగవంతం చేయాలి. పట్టుకోగానే చేసే హడావుడి కన్నా తరువాత పరిణామాలను విశ్లేషించి వాటిపై కూడా మీడియాకు మంచి సమాచారం అందిస్తే ఇంకాస్త బాధ్యత ఉన్న పోలీసులుగా వీరంతా పేరుతెచ్చుకోవడం ఖాయం.
గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో ముగ్గురు ఇంజినీరింగ్ కుర్రాళ్ల నుంచి లక్ష రూపాయలు విలువ చేసే సింథటిక్ డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా ఎంతో సంచలనమైంది. ఇంతవరకూ ఇలాంటి కేసులే తమ దృష్టికి రాలేదని పో లీసులు చెబుతున్నారు. తొలిసారి పట్టుబడిన ఈ డ్రగ్ రాకెట్ గోవా మీదుగా గుంటూరుకు చేరుకుంది. దీని వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం ఉందా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా నగరంలో ఉన్న కొరియర్ సంస్థలపైనా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ ఇక్కడికి చేరుకోవడం వెనుక కారణం అయిన ఏజెంట్లు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది. ఇవన్నీ తేలకుండా ఇంజినీరింగ్ విద్యార్థులను రాజకీయ ఒత్తిళ్ల పేరిట వదిలేస్తే ఇక ఈ కేసు కథ కూడా మూలకు చేరిపోతుంది.