కాంగ్రెస్ వార్ : వైఎస్సార్ వర్గం వేరు కుంపటి?
టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ పై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆయన నాయకత్వంపై ప్రశ్నలు సంబంధిత అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఆయనకు సమర్థ నాయకత్వ లక్షణాలు లేవన్న ఉద్దేశంతోనే సొంత అజెండాతో తమ పనులు తాము చేసుకుని పోతున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ తో పాటు అనేకమంది వైఎస్సార్ వర్గంకు చెందిన నేతలు రేవం త్ ను ఇష్టపడడం లేదు. కానీ అధిష్టానానికి రేవంత్ నచ్చాడు. రేవంత్ ప్లేస్ లో మరొకరిని ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా చేయలేమని కూడా చెబుతున్నారు. ప్రచార కమిటీ బాధ్యతలు చూస్తున్న మధు యాసకీ లాంటి నేతలు కూడా రేవంత్ తో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కేవీపీ కూడా అధిష్టానం నిర్ణయాన్ని సమర్థించి ఆయనతో పనిచేసేందుకు తాను సిద్ధమని, ఓ సారి పార్టీ నిర్ణయం తీసుకున్నాక తాను వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించనని కూడా చెప్పారు. ఇదే దశలో రేవంత్ నిర్ణయాలు మాత్రం అన్నీ ఏకపక్షంగానే ఉంటున్నాయని మరో వాదన వస్తుంది. ఆయన మొండి వైఖరి కారణంగా జిల్లాలలో పార్టీ బలోపేతం కావడం లేదని అంటున్నారు. కేసీఆర్ పై తిట్ల దండకం వద్దనుకుని పనిచేయాలని కూడా హితవు చెబుతున్నారు.
ఇదే సమయంలో మరో అవకాశం ఏమయినా వస్తే పార్టీ మారాలని కూడా వైఎస్సార్ వర్గం యోచిస్తోంది. కొండా సురేఖ దంపతులు వరంగల్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తామని చెబుతున్నారు. కానీ సురేఖను హుజురాబాద్ నుంచి పోటీ చేయించాలని రేవంత్ ఆలోచిస్తున్నాడు. సురేఖ మాత్రం ఇందుకు ససేమీరా అంటున్నారు. ఒకసారి వరంగల్ వదిలి పోయి రాజకీయాలు చేశామని అప్పుడు తమకు కలిసి రాలేదని, ఇకపై ఆ తప్పు చేయమని చెబుతున్నారు. హుజురాబాద్ పై నిర్ణయం అన్నది రేవంత్ తీసుకున్నా, అందుకు అందరూ సమ్మతి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంకొందరు వైఎస్సార్ వర్గం షర్మిల పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటిదాకా షర్మిల పార్టీ నిలదొక్కుకోకపోవడంతో ఆ ఆలోచనను వాయిదా వేసుకుంటున్నా, రేపటి వేళ తెలంగాణలో స్థిరపడితే తప్పకుండా వీరంతా షర్మిల వెనుకే నడిచే అవకాశాలు కోకొల్లలు.