గద్దె వర్సెస్ దేవినేని: పైచేయి ఎవరిది?
గత రెండు పర్యాయాలుగా తూర్పులో గద్దెదే పైచేయి. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన గద్దె, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అధికారంలో ఉన్నప్పుడు తూర్పు ప్రజలకు బాగానే పనులు చేసి పెట్టారు. కానీ ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో గద్దె అనుకున్న మేర పనులు చేయలేకపోతున్నారు. అలా అని సైలెంట్‌గా ఉండటం లేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఎంపీ కేశినేని నాని పార్లమెంట్ నిధులతో నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు.
అయితే దేవినేని...తూర్పు బరిలో రాకముందు వరకు గద్దెకి తిరుగులేదనే చెప్పొచ్చు. ఎప్పుడైతే దేవినేని టిడిపిని వీడి వైసీపీలోకి వచ్చి తూర్పు బాధ్యతలు తీసుకున్నారో అప్పటినుంచి రాజకీయం మారిపోయింది. అసలే తూర్పు, దేవినేని ఫ్యామిలీకి కంచుకోట. దీంతో అవినాష్ మరింత దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గ ప్రజలని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించడానికి చూస్తున్నారు. అధికారంలో ఉండటంతో మంచిగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకోసారి సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి, ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల తూర్పులో అవినాష్‌కు మద్ధతు పెరిగినట్లే కనిపిస్తోంది. పైగా గత విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో తన నియోజకవర్గ పరిధిలో వైసీపీకి ఎక్కువ డివిజన్లు వచ్చేలా చేసుకున్నారు. గద్దె ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఎమ్మెల్యే కంటే ఎక్కువగానే దేవినేని పనిచేస్తూ, తూర్పులో పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నారు.