జగన్ అంటే సీఎం : కాంట్రాక్టర్లు కావలెను!
విశాఖ పనులకూ, విజయవాడ పనులకూ కాంట్రాక్టర్లు లేరు. లేరు కాదు రారు అని రాయాలి. భయపడిపోతున్నారు.. జగన్ అంటే ! నిధులు ఇవ్వని కారణంగా వారికి పుట్టిన భయం మరో పని చేసేందుకు కూడా ఆలోచన ఇవ్వడం లేదు. సకాలంలో అభివృద్ధి పనులు చేసిన వారికి కూడా ఈ ప్రభుత్వం బిల్లుల బకాయిల చెల్లింపులో చేసే అలసత్వమే ఇందుకు కారణం. కొన్ని చోట్ల శిలాఫలకాలకే పనులు పరిమితం కావడం, తాము చెప్పినా కాంట్రాక్టర్లకు ఆర్థిక భరోసా దక్కక పనులు చేయడం లేకపోవడం ఇప్పటి దయనీయ స్థితికి తార్కాణం అని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మరో సందర్భంలో అధికార బలం కారణంగా పర్సంటేజీల గొడవలు కూడా వినిపించి పనులు నిలుపుదల చేయించిన ఘటనలూ ఉన్నాయి.
నిధులున్నా కూడా పనులకు ఆటంకం ఉందని ఏపీ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. బిల్లులు క్లియర్ చేయడంలో వైసీపీ సర్కా రు ప్రాధాన్యాలు అన్నవి అప్పటికప్పుడు మారిపోతాయని, దీంతో పనులు చేసినా కూడా వెనువెంటనే బకాయిలు విడుదల కాక వడ్డీలకు అప్పులు తెచ్చి నిట్టనిలువునా మునిగిపోతున్నామన్నది కాంట్రాక్టర్ల ఆవేదన. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల బెదిరిం పు ధోరణి కారణంగా కూడా పనులు ఆగిపోతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ రహదారులు ఇప్పటికిప్పుడు పూర్వ వైభవం తెచ్చుకోవడం అన్నది జరగని పని.
సీఎం జగన్ ఎన్ని మంచి పనులు చేయాలనుకున్నా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయన్నది వైసీపీ మాట. తాము తలచిన విధంగా పనులు చేపట్టేందుకు కొన్ని అవరోధాలు ఎప్పటికప్పుడు కొందరు సృష్టిస్తున్నారని, అందుకు కేంద్రం కూడా ఓ కారణ మేనని అంటోంది. గ్రామీణ రహదారుల విషయమై తాము పనులు చేపట్టాలనుకున్నప్పటికీ కాంట్రాక్టర్లు దొరకడం లేదని చెబుతోం ది. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని అంటోంది. ముఖ్యంగా కొన్ని చోట్ల బిల్లులు కావడం లేదన్న మాటే వినిపిస్తు న్నా, అబ్బే! అదేం లేదని చెబుతోంది. వాస్తవిక స్థితి గతులు చూస్తే ఇప్పటికీ గ్రామీణ రహదారుల విషయమై ముఖ్యంగా శ్రీకాకు ళంలాంటి ప్రాంతాలలో చేపడుతున్న పనుల విషయమై ఏ స్పష్టతా లేదు. ఇందుకు ఓ ఉదాహణ చూద్దాం.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధి గార మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ మండలంలోని శ్రీకూర్మం పంచాయతీ, చీడిపేట గ్రామంలో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. రోడ్డు వేసేందుకు అధికారులు మాత్రం మొగ్గు చూపడం లేదు. రెండు కిలోమీటర్ల మేరకు ఈ రోడ్డు వేస్తే గ్రామంలో సమస్యలు తీరుతాయి. కానీ ఉపాధి హామీ పథకం కింద నిధులున్నా కూడా ఎవ్వరూ గతంలో ముందుకు రాలేదు. కేవలం నిధులు లేవన్న కారణంగా కొన్ని పనులు, బిల్లులు కావన్న అపనమ్మకంతో ఇంకొన్ని పనులు ఆగిపోతున్నాయి. ఉపాధి నిధులు సకాలంలో వినియోగం కాక కొన్ని పనులు నిలిచిపోతున్నాయి. గ్రామంలో రోడ్డు వేసేందుకు ఉపాధి నిధులు కేటాయింపు జరిగినా, పనులు చేపట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కుపోయాయని అధికారులు చెబుతున్నారు.