స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను తాడేపల్లి ప్యాలెస్ కు తాకట్టు పెట్టడం మీ కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోతుందంటూ ఏపీ డీజీపీపై టీడీపీ నేత నారా లోకేష్ మండి పడ్డారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకున్న జగన్ రెడ్డిని వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుస్తారెందుకంటూ నారా లోకేష్ రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడిఓ సరళ గారిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే మౌనంగా ఎందుకున్నారంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంటి పక్కనే జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారా..? అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.
మంత్రులు, ఎమ్మెల్యేల కామక్రీడలకు బలైపోయినా మహిళల ఫిర్యాదుపై స్పందించమంటే..నీళ్లు నములుతారేంటి సార్ అంటూ ప్రశ్నించారు. మీరు షాడో హోంమంత్రి సజ్జల దగ్గర పనిచేస్తున్న గుమస్తా కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు రాష్ట్ర డీజీపీ అని గుర్తుపెట్టుకోండంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దిశ చట్టం చట్టబద్ధం కాలేదని ముందు మీరు సీఎంకి, మంత్రులకు అవగాహన కల్పించాలని డీజీపీకి నారా లోకేష్ సూచించారు. వాళ్లంతా నిందితులకు ఉరిశిక్ష వేసేసాం అని పగటి కలలు కంటున్నారంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నారా లోకేష్ నాడు నేడు పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాడు నేడు పేరుతో లెక్కాజమ లేకుండా వందల కోట్లు తినేస్తూ పిల్లల్ని ప్రమాదంలో పడేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాశం జిల్లా రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల పై కప్పు కూలి విద్యార్థి విష్ణు మృతి చెందాడని... కర్నూలు జిల్లా బురాన్ దొడ్డి ప్రాధమిక పాఠశాలలో స్లాబ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి నియోజకవర్గంలో తెన్నుఖర్జ గ్రామంలో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటూ లోకేష్ ఆరోపించారు. ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్స్, సొంత పత్రికలో డబ్బా యాడ్స్ మాని విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని సీఎంకు సూచించారు.