రైతు వెత: రైతును రాజును చేయండి ప్లీజ్... !

VAMSI
దేశానికి వెన్నెముక, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత, అందరి బంధువు రైతన్న. అయితే వీటన్నిటికీ నిజమైన గుర్తింపు ఎక్కువుగా మాటల్లోనే వినిపిస్తున్నాయి. కానీ వాస్తవంలో కనిపించడం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుండి వ్యవసాయం కొనసాగుతోంది. నిజానికి చెప్పాలంటే ఇదే మొట్టమొదటి వ్యాపారం కూడా, ఎందరో నాయకులు వస్తున్నారు పోతున్నారు, దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. అనేక వ్యాపార రంగాలు అత్యున్నత స్థాయిలకు ఎదిగాయి. రకరకాల పరిశ్రమలకు వేల కోట్ల రుణాలు ఇచ్చి మరీ వాటిని అభివృద్ధి చేస్తున్నారు. కానీ రైతు మాత్రం అదే జీవనాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. నాటికి నేటికి రైతుల జీవితంలో, జీవన విధానంలో చెప్పుకోదగ్గ, రైతు ఆశించినంత మార్పులేమీ రాలేదనే చెప్పాలి. ఎందరో నాయకులు వస్తున్నారు పోతున్నారు.
గద్దె ఎక్కేముందు ఎన్నో హామీలు ముఖ్యంగా రైతులకు అధిక హామీలు ఇస్తారు కానీ చివరికి ఒరిగిందేమీ లేదు. అంతో ఇంతో చేసి సర్దిపెట్టేస్తున్నారు. 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న సామెత లాగే రైతు జీవితం అక్కడే నిలిచిపోయింది. నేటికి రైతుల ఆత్మహత్యలు జరుగుతుండడం. అందులోనూ భూమిని నమ్ముకుని బ్రతికే రైతులు ఎందరో ఈ భారత భూమిపై బలవన్మరణాలకు పాల్పడడం నిజంగా దురదృష్ట కరం. వ్యాపారం కోసం అయితే ఎన్నో స్కీములు, సబ్సిడీలు, రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు. దేశానికి అన్నం పెట్టే రైతు పంట పండించుకోవడానికి పెట్టుబడి లేక బ్యాంకుల చుట్టూ రుణాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగినా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎన్నో ఆంక్షలు, వెంటనే పని కాదు. పంటకి సరిపడే నీళ్ళు లేవు..పాలకులు చెబుతున్న నీటి వనరుల ప్రాజెక్టు మొక్కుబడిగా ఒకటో రెండో తప్ప అందరి కష్టాలు తీర్చేలా లేవు.

 టెక్నాలజీ ఇంతగా మారిన రైతుకు సరైన పనిముట్లు అందించే వారు లేరు. పంటకి కావాల్సిన విత్తనం నుండి పంట పండే వరకు రైతుకు ప్రతిదీ ఒక పద్మవ్యూహమే. ఎలాగోలా పంట చేతికి వచ్చింది దేవుడా అని కాస్త సేద తీరే లోపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీర్చే దారి కనబడక ఇలా రైతు అంటేనే ఆ పని మాకొద్దు బాబోయ్ అనేట్టుగా రైతు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో లో రైతులకు కేటాయించిన వసతులు ఉన్న హామీలు ఆ తర్వాత ఆచరణలోకి వస్తున్నాయా...వచ్చినా ఎన్ని వస్తున్నాయి, ఎంతవరకు అమలు అవుతున్నాయి అన్న ప్రశ్నలకు పాలకులే సమాధానం చెప్పాలి. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పౌరులు ఇంజనీర్లు , డాక్టర్లు, టీచర్లు, ఆఫీసర్లు ఇలా అవ్వాలని కోరుకుంటారు తప్ప రైతులు  అవ్వాలని మాత్రం అస్సలు అనుకోరు. రోజు కూలీ పనికన్న దారుణమని ఫీల్ అయిన అవుతారేమో, అలాంటి రోజులు రాకముందే ప్రపంచానికి  ఎంతో విలువైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలి. అంటే రైతును అభివృద్ధి పరచాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: