గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ దారుణ ఘటన పై టిడిపి జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన చెందారు. స్వాతంత్ర దినోత్సవం నాడే గుంటూరు కాకాని సమీపంలో దళిత విధ్యార్ధిని రమ్య హత్య తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్దరాత్రి ఆడపిల్ల ఒంటరిగా బయటకు రాగలిగినప్పుడే అసలైన స్వాతంత్ర్యం అని గాంధీ మహాత్ముడు శతాబ్దాల క్రితం అంటే.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకపాలనలో పట్టపగలు ఆడపిల్ల సొంత ఇంట్లోనైనా భద్రంగా వుండగలిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని మహిళాలోకం భయం భయంగా బతుకుతోందని పేర్కొన్నారు చంద్రబాబు. వైపీసీ ఆరాచక పాలనకు నిదర్శనమే రమ్య మర్డర్ అని ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలోనే ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యమైపోయాయని మండిపడ్డారు. గడిచిన రెండేళ్లలో 500కిపైగా మహిళలపై దాడులు, అత్యాచారఘటనలు జరిగాయి నేటికీ చాలా కేసుల్లో నిందితులని పట్టుకోలేకపోవడం, ప్రభుత్వ చేతకానితనమా? నిందితులకు ప్రభుత్వమే రక్షన కల్పిస్తోందా? అనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయని స్పష్టం చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోని సీతానగరంలో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితుణ్ణి పట్టుకోలేకపోవడానికి కారణమేంటి? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి చంపితే నేటికీ ఆ కేసులో పురోగతి లేదని నిప్పులు చెరిగారు.
దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఎక్కువగా దళిత మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా, స్పందించకపోవడానికి ఆమె షాడో హోంమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారడమే కారణమని మండిపడ్డారు చంద్రబాబు. ఏకంగా ముఖ్యమంత్రి చెల్లెలు సునీతారెడ్డి తనకు ప్రాణహాని వుందని పోలీసులకు ఫిర్యాదు చేసిందంటే..ఇక సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరుకుతుంది? అని నిలదీశారు. రమ్యని దారుణంగా చంపిన హంతకుడ్ని పట్టుకుని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి, రాష్ట్రంలో మరో మహిళకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.