గాంధారం గందరగోళం.. భారత్ పక్కలో మరో బల్లెం..?
తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి అఫ్గాన్ ప్రభుత్వం తాజాగా ముందుకొచ్చింది. ఖతార్‌లోని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. అఫ్గానిస్థాన్‌లోని ఇప్పటికే కీలక ప్రాంతాలు తాలిబన్ల వశమయ్యాయి. అఫ్గానిస్థాన్ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు బాగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే అఫ్గాన్‌లోని అనేక భూభాగాలను ఆక్రమించేశారు. తాజాగా రాజధాని కాబూల్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్నీ పట్టణాన్ని కూడా ముష్కర మూకలు ఆక్రమించేశాయి.
కాబూల్-కాందహార్ జాతీయ రహదారిపై ఈ గజ్నీ నగరం ఉంటుంది. ఈ కీలక నగరాన్ని తాలిబన్లు ఆక్రమించడంతో ఇక వారిని ఆపలేమని అఫ్గాన్ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే అఫ్గాన్ ప్రభుత్వం ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని అనేక ప్రాంతాలు కోల్పోయింది. అందుకే తాలిబన్లతో కలిసి అధికారం పంచుకునేందుకు ముందుకొస్తోంది. అయితే ఈ పరిణామం ఇండియాకు చేటు చేస్తుంది.. తాలిబన్లతో అఫ్గాన్ ప్రభుత్వం రాజీ పడితే.. ఆ దేశం మరోసారి ముష్కర మూకల కేంద్రం అవుతుంది.
ఇక తాలిబన్లతో పాక్ దోస్తీ సంగతి తెలిసిందే. ఇప్పటికే సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాక్ ముష్కర మూకలు... తాలిబన్ల అండతో మరింతగా రెచ్చిపోవచ్చు.. పాక్ టెర్రరిస్టులు, తాలిబన్లు చేతులు కలిపితే అది భారత్‌కు నష్టదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు.