వుహాన్ ల్యాబ్: మరిన్ని వేరియంట్స్ ఉద్భవిస్తాయన్న చైనీస్ వైరాలజిస్ట్..!
అమెరికా, చైనాలతో సహా అనేక దేశాలు డెల్టా వేరియంట్‌తో సతమతమవుతున్న వేళ చైనా 'బ్యాట్ ఉమెన్' నుంచి సంచలన వ్యాఖ్యలు రావటం గమనార్హం. డెల్టా వేరియంట్ బారిన పడిన రోగుల ముక్కులలో 1,260 రెట్లు ఎక్కువ వైరస్లు ఉంటాయని చైనా వైరాలజిస్ట్‌లు శాన్ డియాగోలో పరిశోధనలు చేసి వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందడమే డెల్టా వేరియంట్ "సూపర్ పవర్" అని చైనీస్ పరిశోధకులు చెప్పారు.
ఇటీవలి కాలంలో డెల్టా వేరియంట్ చైనా దేశాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం చైనా దేశంలోని చాలా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రజలను వైరస్ నుంచి కాపాడేందుకు జిన్‌పింగ్ నేతృత్వంలో దేశం నడుంబిగించింది. 28,000 మంది ఆరోగ్య కార్యకర్తలను నగరాల్లోని వేలాది పరీక్షా కేంద్రాలలో పని చేసేలా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా, చైనాలో అనేక నగరాలలో లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అక్కడి వైద్యాధికారులు కరోనా కేసుల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు సామూహిక పరీక్షలు చేస్తున్నారు. గత కొద్ది వారాలుగా చైనాలోని నాన్జింగ్‌లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంట్ కేంద్రబిందువుగా ఉన్న నాన్జింగ్‌లో కార్మికుల వల్ల వ్యాప్తి చెందిందని చైనా నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇకపోతే అమెరికా ప్రభుత్వం కూడా డెల్టా వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరికి టీకా అందించాలని.. లేకపోతే ఆసుపత్రిలో చేరే పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్, డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు.