ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భేటీ అయిన సంగతి విధితమే. అయితే.. ఈ సందర్భంగా తెలంగాణ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా అనాథ పిల్లలు, అనాథ ఆశ్రమాల పై కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనాథ పిల్లల స్థితిగతులు, సమస్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ.. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈ సబ్ కమిటీలో హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు జగదీశ్ రెడ్డి ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి... అనాథలైన పిల్లల పూర్తి సమాచారం వెంటనే ఇవ్వాలని వైద్య శాఖ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేశారు. ఆ సమాచారం.. ప్రకారం అనాథ పిల్లలకు అండగా నిలుస్తూ.. వసతి, విద్యా, తదితర అంశాలను వారికి కల్పించడమే కేబినేట్ సబ్ కమిటీ ముఖ్య లక్ష్యం. వారికి ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం ఈ సబ్ కమిటీ పనిచేయనుంది. అలాగే.. 50 వేల వరకు రైతు రుణమాఫీ ఆగస్ట్ 15 నుండి ఆగస్ట్ చివర వరకు పూర్తి చేయాలని తెలంగాణ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
ఈ రుణమాఫీ ద్వారా 6 లక్షల మంది రైతులకు లబ్ది జరుగనుంది. ఉద్యోగాల్లో ews రిజర్వేషన్లలో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్ళు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్న కేబినేట్...వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉండాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. కొత్తగా ఏర్పాటు చేయనున్న 7 మెడికల్ కాలేజి లకు స్థల సేకరణ మౌళిక వసతుల కల్పన, హాస్టల్స్, ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేబినేట్. భవిష్యత్ లో మంజూరు అయ్యే మెడికల్ కాలేజి లకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపింది. గ్రేటర్ పరిధిలో నిర్మించే మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అలాగే.. పఠాన్ చెర్వులో కార్మికుల కోసం మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.