హుజురాబాద్ లో కాంగ్రెస్ పుంజుకునేనా ?

VAMSI
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయాలలో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నది. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉదంతం ఇప్పుడప్పుడే మరువలేనిదిగా చెప్పవచ్చు. కేసీఆర్ కు ఈయనకు అంతర్గత అభిప్రాయబేధాలు రావడం, ఆయనపై భూకబ్జా వివాదాల పేరుతో మంత్రి పదవి నుండి బహిష్కరించడం లాంటివి ఎన్నో జరిగిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు తెరలేచింది.
ఈ హుజురాబాద్ ఎన్నికల గురించి ప్రస్తుతం నడుస్తున్న కథంతా పరిశీలిస్తే, మళ్ళీ తెరాస ఈ స్థానాన్ని గెలుచుకుని ఈటల రాజేందర్ పై తన పంతాన్ని కొనసాగిస్తుందని తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఓటర్లు ఎవరిని ఎప్పుడు ఎలా గద్దెనిక్కిస్తారో ? ఎప్పుడు గద్దె దింపుతారో వారికే ఎరుక. కానీ ఈ సారి అంత ఈజీగా తెరాసకు గెలుపు దక్కపోవచ్చన్నది కొందరి వాదన. కేసీఆర్ కు అసలు పోటీ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందని అంటున్నారు. ఇక ఈటల రాజేందర్ కేసీఆర్ పై చాలా కోపంగా ఉన్నారు. ఈటల బీజేపీలో చేరి కేసీఆర్ ను ఢీకొట్టడానికి రెడీ అయిపోయారు.
మరో వైపు కొత్తగా పీసీసీ పగ్గాలందుకున్న రేవంత్ రెడ్డిని సైతం తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. తన మాటలతో ప్రజలను తనవైపుకు తిప్పుకోగల సమర్ధుడు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ హుజురాబాద్ లో పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ పడే పార్టీలు అన్నీ ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కనీసం అభ్యర్థి ఎవరన్న విషయం కూడా ఆలోచించినట్లు తెలియరాలేదు. అయితే ఈ ఎన్నికలో సైలెంటుగా తన పనితనాన్ని చూపించనున్నాడని తెలుస్తోంది. విజయాన్ని సాధించకపోయినా కాంగ్రెస్ బలం ఏమిటో తెలిసేలా చేస్తాడని అర్ధమవుతోంది. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరి కొంతకాలం ఆగక తప్పదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: