ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన పథకాన్ని తీసుకువచ్చిన తెలిసిందే. కాగా తాజాగా ఈ రోజు ఈ పథకం రెండో విడత సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో గుంటూరు పట్టణానికి చెందిన విద్యా దీవెన పథకం లబ్ధిదారు అయిన బీటెక్ విద్యార్థిని సుమ్రిత పాల్గొంది. ఈ సమావేశంలో విద్యార్థిని సుమ్రిత మాట్లాడుతూ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించింది. విద్యాదీవెన మరియు వసతి దీవెన పథకాలను కొనియాడింది. సుమ్రిత మాట్లాడుతూ.... విద్యా దీవెన మరియు వసతి దీవెన లాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపింది.
విద్యార్థిని సమ్రిత ఇంగ్లీష్ లో గడగడా మాట్లాడుతూ... సీఎం జగన్ చేత కూడా ప్రశంసలు పొందింది. అంతేకాకుండా విద్యార్థిని ధైర్యానికి ఈ సమావేశంలో హాజరైన పెద్దలంతా ఆశ్చర్యపోయారు. విద్యా దీవెన లాంటి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పింది. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడాని ఈ పథకాలు ఎంతో మేలు చేస్తాయని ప్రశంసించింది. అంతేకాకుండా గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద కేవలం 33 వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందుతోందని హర్షం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా ఈ డబ్బును విద్యార్థుల తల్లి ఖాతాలో జమ చేయడం చాలా మంచి నిర్ణయం అని... ఈ నిర్ణయం ఎంతో బాగుందని చెప్పింది. అంతేకాకుండా వసతి దీవెన వల్ల కూడా తమ తల్లిదండ్రుల పైన ఆధారపడే అవసరం లేకుండా పోయిందని సంతోషించింది. ఏపీ ఎస్ ఎస్ డీసీ కోర్సుల ద్వారా తమకు సంబంధించిన మరిన్ని స్కిల్స్ ను అందిస్తూ ఉద్యోగం సంపాదించడం లో ప్రభుత్వం ఎంతో సహాయపడుతుందని తెలిపింది. తమలాంటి విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్ మరిన్ని ఏళ్లపాటు సీఎంగా ఉండాలంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రిని మామయ్య అని ఆప్యాయంగా పిలిచి ఆశ్చర్యపరిచింది. సమ్రిత థాంక్యూ మావయ్యా అంటూ తన ప్రసంగాన్ని పూర్తి చేసింది.