సీఎం సీటు నుంచి ‘యెడ్డీ’ ఎగ్జిట్.. కర్నాటక నెక్స్ట్ సీఎం ఎవరో?

praveen
దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం కర్నాటక. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బీ.ఎస్.యడ్యూరప్ప తన సీఎం పదవికి తాజాగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కర్నాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి. యడ్యూరప్ప తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అఫీషియల్‌గా సమర్పిస్తానని ప్రకటించారు. ఈ విషయమై తానేమీ బాధపడటం లేదని, తనకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండేళ్ల పాటు సీఎం పదవిలో కూర్చొనే అవకాశం ఇచ్చారని తెలిపారు. అందుకుగాను వారికి ధన్యవాదాలు తెలిపాడు యడ్యూరప్ప. ‘యెడ్డీ’ రాజీనామాపై కర్నాటక రాజకీయ వర్గాల్లో మొదటి నుంచి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

శక్తిమంతమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పను సీఎం పీఠంపై నుంచి తొలగించేందుకు గల కారణాలంటనే ప్రశ్న ఆయన వర్గీయుల్లో మొదలైంది. యడ్యూరప్పకు ప్రజాబలం తగ్గిందని హైకమాండ్ భావిస్తున్నట్లు వార్తలూ వచ్చాయి. కానీ, కన్ఫర్మేషన్ అయితే లేదు. రాష్ట్రంలో ఆయన్ను సీఎంగా కొనసాగిస్తే బీజేపీకి నష్టమని భావించిందో లేక పార్టీలో ఏ నేత అయినా 75 ఏళ్లకు మించి ఉన్న వారు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండకూడదనే రూల్ ఉంది. ఆ ప్రకారంగా యడ్యూరప్పకు డెడ్ లైన్ విధించిందని తెలుస్తోంది. అయితే, యడ్యూరప్పకు ఈ విషయంలో ఆల్రెడీ మూడేళ్ల ఎక్సెంప్షన్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. 78 ఏళ్ల వయస్సున్న యడ్యూరప్పను తొలగించిన పార్టీ అధిష్టానం నెక్స్ట్ ఎవరికి సీఎం పీఠం కట్టబెడుతుందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  

యడ్యూరప్పను సీఎం పీఠం నుంచి తొలగించేందుకు గాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోశ్, రవి పావులు కదిపినట్లు యడ్యూరప్ప వర్గీయులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, నాయకత్వ మార్పు అనేది తమ పార్టీలో సహజమే అనే వాదించే వారు సైతం ఉన్నారు. ఈ క్రమంలో మొత్తంగా బీజేపీ అధినాయకత్వం రాష్ట్రాల నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్న సంగతి ఇటీవలి పరిస్థితులను బట్టి అంచనా వేసుకోవచ్చు. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ సీఎం మార్పు ఇటీవల మనం గమనించగా, త్వరలో బీజేపీ పాలిత కర్నాటకో నూతన ముఖ్యమంత్రి రాబోతున్నాడు. అయితే, ఆయన ఎవరు అనేది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుంది. ఇక ఈ రాష్ట్రంలో ఇప్పట్లో అయితే ఎన్నికలు లేవు. 2023లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: