షాకింగ్‌: రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్‌ ఫోన్లు కూడా హ్యాక్..?

Chakravarthi Kalyan
సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు పేలిన పెగాసన్‌ హ్యాకింగ్ వ్యవహారం దేశంలో పెను దుమారమే రేపుతోంది. ఈ పెగాసస్‌ లక్ష్యంగా చేసుకున్న ప్రముఖుల జాబితాలో చాలా పెద్ద పెద్ద పేర్లే వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా కూడా ఈ జాబితాలో ఉన్నట్టు వస్తున్న కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాహుల్, ప్రశాంత్ కిషోర్‌ ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌ టార్గెట్‌ జాబితాలోఉన్నట్టు ప్రముఖ వెబ్‌ పోర్డల్ ది వైర్‌ తన తాజా కథనంలో బయటపెట్టింది.

ఇజ్రాయల్‌ కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ తో దేశంలోని ప్రముఖులను టార్గెట్ చేసుకున్నారన్న విషయం ఇప్పటికే బ్లాస్ట్ అయ్యింది. పెగాసస్‌ స్పైవేర్‌ మొత్తం 300 మందికి పైగా భారతీయలను టార్గెట్ చేసుకున్నట్టు  ది వైర్‌ వార్తా సంస్థ ముందు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సంస్థ తాజాగా మరో కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులో కొన్ని పేర్లు బయటపెట్టింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఉపయోగించిన కనీసం రెండు ఫోన్‌ నంబర్లు ఈ పెగాసన్ లిస్టులో ఉన్నాయట. అంతే కాదు.. రాహుల్‌ తో బాగా క్లోజ్ గా ఉండే మరో ఐదుగురి ఫోన్‌ నంబర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయట.

రాహుల్ తరవాత వెలుగు చూస్తున్న మరో ప్రముఖమైన పేరు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌. ఆయన ఫోన్‌ను కూడా పెగాసస్‌తో హ్యాక్‌ చేశారని ఈ కథనం చెబుతోంది. ఇటీవల పీకే ఫోన్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించి.. ఒకసారి హ్యాక్‌ అయిందని గుర్తించారట. ఇక ఈయన తర్వాత జాబితాలో ఉన్నవారిలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా ఉన్నారట. అంతా విపక్షాలకు చెందిన వారే కాదు.. కొందరు బీజేపీ నేతల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

కేంద్రం మాత్రం ఇదంతా ఒట్టి బోగస్ అంతా కల్పితం అంటూ కొట్టి పారేస్తోంది. పెగాసస్‌తో హ్యాకింగ్‌ వ్యవహారంపై కథనాలు కావాలనే ప్రచారం చేస్తున్నారంటోంది. ఉద్దేశపూర్వకంగా  భారత ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో అన్నారు. విచిత్రం ఏంటంటే.. ఆయన పేరు కూడా ఈ పెగాసన్ లిస్టులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: