కేంద్ర ప్ర‌భుత్వం వీళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందా... సంచ‌ల‌న నిజాలు ?

VUYYURU SUBHASH
ఫోన్ ట్యాపింగ్ అంశం మరోమారు సంచలనంగా మారింది. కేంద్రప్రభుత్వమే దాదాపు 300 మంది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందనే విషయం ఇపుడు సంచలనంగా మారింది. విషయం ఏమిటంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యే మొదటిరోజే ఫోన్ల ట్యాపింగ్ అంశం బయటపడటం. ఇప్పటికే అనేక అంశాలపై నరేంద్రమోడి సర్కార్ ను నిలదీయాలని ప్రతిపక్షాలు, యూపీఏ భాగస్వామ్యపక్షాల నేతలు గట్టిగా డిసైడ్ అయ్యారు.
అందుకనే ఇటు మోడి అయినా అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు అయినా లోక్ సభ, రాజ్యసభలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. సహకారాన్ని కోరారు. సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి ప్రతి సమావేశాల సందర్భంగా అధికారపార్టీ చేసేపనే ఇది. అధికారపార్టీ విజ్ఞప్తి చేస్తునే ఉంటుంది ప్రతిపక్షాలు చేసేది చేస్తునే ఉంటాయి. కరోనా వైరస్ టీకాల విషయంలో విఫలమైన మోడి సర్కార్ ను ఓ ఆటాడుకోవాలని ఇప్పటికే ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
కోవిడ్ విషయమే కాకుండా అనేక వైఫల్యాలపై కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఇలాంటి సమయంలో ఫోన్ల ట్యాపింగ్ అంశం బయటపడింది. ఇద్దరు కేంద్రమంత్రులు, అనేమంది ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, ఓ సిట్టింగ్ జడ్జ్, న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు, హక్కుల కార్యకర్తలు ట్యాపింగ్ జాబితాలో ఉన్న విషయం బయటపడింది. 2018-19 నుండే వీళ్ళ ఫోన్లు హ్యాక్ అయినట్లు తాజాగా వెల్లడైంది.
ఇజ్రాయెల్ కు ఎస్ ఎస్ ఓ అనే గ్రూపుకు చెందిన పెగాసస్ అనే స్పైవేర్ టెక్నాలజీతో 300 మంది ఫోన్లను కేంద్రమే హ్యాక్ చేయిస్తున్నట్లు ‘ది వైర్’ అనే మీడియా ద్వారా బయటపడింది. ఎందుకంటే ఇలాంటి స్పైవేర్ ప్రభుత్వాల దగ్గర మాత్రమే ఉంటుందట. నిఘా కార్యకలాపాల కోసం ఎస్ఎస్ఓ గ్రూపు ఇలాంటి స్పైవేర్ ను అనేక దేశాలకు అమ్మిందట. ఇలాంటి స్పైవేర్ నే కేంద్రప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది. దాంతోనే ఇపుడు హ్యాకింగ్ జరిగిందని బయటపడింది.
 
అసలు ఇంతమంది ఫోన్లు బయటపడిందా లేదా అనేది కూడా ఓ అనుమానంగానే ఉంది. కాకపోతే జాబితాలో ఉన్న 300 మంది ఫోన్లను ర్యాండంగా సెలక్ట్ చేసుకుని వాటిపై డిజిటల్ ఫోరెన్సిక్ పరీక్షలు జరిపినపుడు ఆ ఫోన్లు హ్యాక్ అయినట్లు నిర్ధారణయ్యింది. దాంతో  మిగిలిన 290 ఫోన్లు కూడా హ్యాక్ అయినట్లు తెలిసిపోయింది. స్పైవేర్ కేంద్రం దగ్గర మాత్రమే ఉండటం వల్ల కేంద్రమే పై 300 ఫోన్లను హ్యాక్ చేయించినట్లు ది వైర్ చెబుతోంది.
నిజానికి ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలు అప్పుడప్పుడు వెలుగు చూస్తునే ఉంటాయి. రాజీవ్ గాంధి ప్రధానమంత్రిగా ఉన్నపుడు కూడా ఇలాంటి అరోపణలే వచ్చాయి. అలాగే యూపీఏ-2 ప్రభుత్వంలో కూడా కొందరు మంత్రుల ఫోన్లు ట్యాప్ అయినట్లు అప్పట్లో వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారింది. అయితే ఆ ఆరోపణలను అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం కొట్టిపారేశారు. అయితే ఆరోపణలకు కూడా సరైన ఆధారాలు బయటపడకపోవటంతో ఆరోపణలు ఆరోపణలుగానే ఉండిపోయాయి.
కానీ ఇపుడు బయటపడింది కేవలం ఆరోపణలు మాత్రమే కాదని ఆధారాలతో సహా ఎవరెవరి ఫోన్లు కేంద్రం ట్యాపింగ్ చేయించిదనే విషయం బయపటడింది. అంటే ది వైర్ కథనంలో 300 మంది పేర్లు బయటపడకపోయినా కచ్చితంగా సదరు మీడియా దగ్గర పేర్లు కూడా ఉండే ఉంటాయని అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేంద్రమంత్రులు, ప్రతిపక్షనేతలు, ఓ జడ్జీ, వ్యాపారస్తులు, హిందుస్ధాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, న్యూస్ 18, ఇండియా టుడే, ది హిందు సంస్ధల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఫోన్లుండటమే సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: