ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.వాలంటరీ రిటైర్‌మెంట్ కోరుతూ కేంద్రానికి ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా ఉన్నారు.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.త్వరలో ఆయన రాజకీయాల్లోకి రావాలాని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతంది.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ పార్టీని స్థాపిస్తారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.తాను రాజీనామా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పనిచేయదలుచుకున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. 26 ఏళ్లు పాటు తన మాతృభూమికి ఐపిఎస్ అధికారిగా సేవ చేసినట్లు ఆయన తెలిపారు.
పేద ప్రజలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకిష్టమైన రీతీలో చేస్తానని ఆయన చెప్పారు. ఫూలే, అంబేడ్కర్ మార్గంలో నడుస్తానని ఆయన చెప్పారు. ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో జన్మించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ 2002 నుంచి 2004 వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలోనే ఆయన మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.ఆయన పిలుపుతో ఒకే సారి 45 మంతి జనశక్తి మావోయిస్టులు లొంగిపోయారు.ట్రైబల్ ఏరియాలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక కార్యక్రమాలు నిర్వహించారు.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలోనే మంథని,కాటారం,మహదేవ్ పూర్‌లో సంచలన ఎన్‌కౌంటర్‌లు జరిగాయి.
అత్యున్నతమైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలావత్ పూర్ణ,ఆనంద్‌లు ఆయన శిష్యులే,దళిత గిరిజన బిడ్డలు అత్యున్నత స్థానాల్లో ఉండాలని ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆంకాంక్షించేవారు.బడుగు బలహీన వర్గాల సాధికారిత కోసం స్వేరోస్ అనే సంస్థని స్థాపించి కొత్త ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు.తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాలను పూర్తిస్థాయిలో మార్చేశారు.అత్యాధునిక హంగులతో అన్ని గరుకులాలను ఆధునీకరించారు.మంచి విద్యాబోధన అందించేలా ఆయన చర్యలు తీసుకున్నారు.అయితే ప్రవీణ్ కుమార్‌పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా బీజేపీ నేతలు ఆయనపై అనేకసార్లు మతపరమైన ఆరోపణలు చేశాయి. హిందూ దేవుళ్ల మీద ప్రమాణం చేయడాన్ని ఆయన వ్యతిరేకించడంతో పలు హిందూ సంస్థలు ఆయనపై మండిపడ్డాయి.