వైఎస్ బొమ్మ షర్మిలకు కలిసొస్తుందా ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా తొలి దశ కావడం వలన రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడంలో పొరపాట్లు చేస్తున్నట్లుగా అవగతమవుతోంది. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణాలో ఎలాగైనా రాజన్న రాజ్యం తెస్తానని తాను వచ్చిన రోజు నుండి చెబుతూనే ఉంది. వైఎస్ పథకాలను మరియు ఆయన ఆశయాలను ప్రజలకు అందించడానికి షర్మిల పార్టీ పెట్టనున్నారన్న విషయాన్నీ ఇప్పటికే ప్రకటించారు. రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ పేరును మరియు పార్టీ జెండాను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. అయితే నిన్ననే షర్మిల పార్టీ జెండాకు సంబంధించి ఒక చిత్రం విడుదలయింది. ఈ జెండాపై పలు విధాలుగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ జెండాలో చూస్తే తన తండ్రి బొమ్మను ప్రధానంగా ముద్రించి ఉన్నది. దీనితో షర్మిల సామర్ధ్యాన్ని ప్రశ్నించే విధంగా చర్చలు జరుగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే షర్మిల రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మను ముందు పెట్టుకుని తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా ఉందని పలువురు అనుకుంటున్నారు. అందుకోసమే పార్టీ జెండాలో ఆయన బొమ్మను ఉండేలా ప్లాన్ చేసిందని అనుకుంటున్నారు. అది నిజమే అయితే ఎంతమేరకు వైఎస్ బొమ్మ షర్మిల రాజకీయ విజయానికి ప్లస్ అవుతుందన్నది ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఉంది. కానీ వైఎస్ జగన్ మాత్రం పార్టీ పేరులో తండ్రి పేరు వచ్చేలా పెట్టుకుని సక్సెస్ అయ్యాడని చెప్పాలి. షర్మిల ఇక్కడ కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నట్లు ఉంది. కానీ తెలంగాణ ప్రజలు అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు. కేవలం వైఎస్ బొమ్మ చూసి షర్మిలను ఆదరిస్తారా అంటే సమాధానం ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ బొమ్మను చూసి చాలా మంది ప్రజలు షర్మిలను ఆహ్వానిస్తారు మరియు అభిమానిస్తారు. అయితే ఎంతవరకు రాజకీయంగా ప్లస్ అవుతారన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.

 కానీ పార్టీ జెండాలో ఆయన ముఖాన్ని వాడుకుంటున్న షర్మిల, వైఎస్సార్ ఆశయాలను మరియు ఆయన ధైర్యాన్ని తెగువను పుణికిపుచ్చుకోవడంలో వెనుకబడిందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఆనాడు వైఎస్ఆర్ ప్రజలందరికీ సమన్యాయం అందించడానికి ఎంతకైనా తెగించేవారు. కానీ షర్మిల వ్యవహారం చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే జలవివాదంపై షర్మిల చేసిన వ్యాఖ్యలు. ఈ విషయంపై షర్మిల, "ఎటువంటి పరిస్థితుల్లో ఏపీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన జలాలను తీసుకు పోనివ్వను అని మాట్లాడడం విమర్శలకు దారి తీస్తోంది. అదే వైఎస్ అయితే రెండు రాష్ట్రాలకు సమన్యాయం కలిగేలా కూర్చుని పరిష్కరించుకుంటామని చెప్పేవారు. ఆ ఆలోచన మరియు సమన్యాయం చేయాలనే ధోరణి షర్మిలలో  కనిపించకపోవడం దారుణమని వైఎస్ అభిమానులే విమర్శిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే షర్మిల వైఎస్సార్ బొమ్మ పెట్టుకోవడం కాదు. ఆయన సూత్రాలను, ఆశయాలను వంటపట్టించుకోవాలి, అప్పుడే ప్రజలు వైఎస్సార్ బిడ్డగా ఆదరిస్తారు. లేదంటే తెలంగాణాలో ఒక రాజకీయ పార్టీగా మిగిలిపోవడం తప్పితే పెద్దగా ఒరిగేదేమీ లేదు అన్నది వాస్తవం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: