లోకేశూ.. వస్తావా.. డౌట్లు తీరుస్తాం.. ?

Chakravarthi Kalyan
ఇటీవల ఏపీలో గ్రూప్ వన్‌ పరీక్షల వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ నేత లోకేశ్ కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ గ్రూప్ వన్ పరీక్షల వ్యాల్యూయేషన్ పూర్తయింది. ఇంటర్వ్యూలకు కొందరిని ఎంపిక చేశారు. అయితే ఈ పరీక్షల వ్యాల్యుయేషన్‌ లో ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూల ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది.

అయితే ఈ విషయంలో ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు స్పందించారు. అసలు డిజిటల్‌ మూల్యాంకనం గురించి కనీస పరిజ్ఞానం లేకుండా లోకేశ్‌ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ఏమైనా సందేహాలుంటే అపాయింట్‌మెంటు తీసుకుని కమిషన్‌ దగ్గరకు వస్తే నివృత్తి చేస్తామంటూ  ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ రెండేళ్లలో ఒక్క ఆరోపణ కూడా లేకుండా చాలా నియామకాలు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు తెలిపారు.

గతంలో ఇంటర్వ్యూలకు సింగిల్‌ బోర్డు ఉండేదన్న ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు.. ఇప్పుడు బహుళ బోర్డులు చేశామని చెప్పారు. ఏ సభ్యుడు ఏ బోర్డులోకి వెళ్తారో కూడా తెలియదని సలాంబాబు అంటున్నారు. ఇక ఏపీపీఎస్సీపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చిన సలాంబాబు.. గ్రూప్‌ 1 మెయిన్స్‌లో ఒక అభ్యర్థి నెల్లూరులో 2 పేపర్లు, హైదరాబాద్‌లో 5 పేపర్లు రాశారన్న వార్తల్లో నిజం లేదన్నారు. జీవో ప్రకారం 2 శాతం పోస్టుల్ని స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేయాలని.. అర్హులు లేకపోతే అవి ఓపెన్‌ కేటగిరీలో భర్తీచేయాలని నిబంధనలున్నాయని  సలాంబాబు వివరించారు.  
ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఏ రేషియోలో పిలవాలన్న అధికారం కమిషన్‌కు ఉంటుందని సలాంబాబు అంటున్నారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారమే అందరికీ సమానావకాశాలిచ్చేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఆన్సల్ బుక్‌ లెట్లు  శ్రీకాకుళం, కాకినాడల్లో మారిపోయాయన్న ఆరోపణలు సరికాదన్నారు. మూల్యాంకన విధానం అనేది ఎక్కడా నోటిఫికేషన్లో పేర్కొనరని, అది కమిషన్‌ పరిధిలో నిర్ణయిస్తారని చెప్పారు.  థర్డ్‌ పార్టీ సాంకేతిక, సాఫ్ట్‌వేర్‌ సహకారం, స్కానింగ్, మ్యాపింగ్‌  వంటి పనులకే తప్ప మూల్యాంకనానికి  కాదని సలాంబాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: