అలా... హరీశ్ రావు మళ్లీ కేసీఆర్‌కు దగ్గరయ్యారా..?
అయితే కొన్నిరోజులుగా మళ్లీ హరీశ్ రావు.. కేసీఆర్ టీమ్‌లో క్రియాశీలకంగా ఉంటున్నారు. మళ్లీ సీఎం కేసీఆర్ పార్టీలో కీలక బాధ్యతలు హరీశ్ కు అప్పగిస్తున్నారు. అయితే ఈ మార్పు వెనుక ఓ కథ ఉందని తాజాగా ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. సీఎంకు బాగా నమ్మకస్తుడైన మంత్రి జగదీష్ రెడ్డి ఇటీవల హంపీలో తన కుమారుడి పుట్టినరోజు ఉత్సవం నిర్వహించారట. అక్కడకు కొంతమంది టిఆర్ఎస్ నేతలు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా వెళ్లారట. ఆ సందర్భంగా కొందరు నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ తీరును ఆక్షేపిస్తూ మాట్లాడారట.
అంతే కాదు.. ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా పాట పాడారట. ఇలా జరుగుతున్నా మంత్రి జగదీష్ రెడ్డి వారిని వారించలేదని, మౌనంగా ఉన్నారన్నది అభియోగం. ఈ నేపధ్యంలో తదుపరి టార్గెట్ జగదీష్ రెడ్డి అవుతారా అన్న కథనాలు పత్రికల్లో వస్తున్నాయి. అయితే అసలు ఈ పార్టీ విషయం అందులో పాల్గొన్న ఓ వ్యక్తి ద్వారా మంత్రి హరీశ్ రావుకు తెలిసిందట. ఆయన దీన్ని చక్కగా వాడుకున్నారని ప్రచారం జరుగుతోంది.
పార్టీలో పెద్ద కుట్ర జరుగుతోందని.. హరీశ్ రావు కేసీఆర్ అపాయిట్ మెంట్ తీసుకుని మొత్తం వివరించారట. ఈ కారణంగానే మంత్రి ఈటలను కేసీఆర్ టార్గెట్ చేసి బయటకు పంపారని చెబుతున్నారు. అంతే కాదు.. ఇప్పుడు మంత్రి జగదీశ్ రెడ్డిని కూడా బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని జగదీశ్ రెడ్డి కూడా ఖండించినట్టు లేరు. మొత్తానికి హరీశ్ రావు ఈ విధంగా మామకు దగ్గరైనట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి వాస్తవం ఏంటో వారికే తెలియాలి.