మొన్న రాజకీయ సన్యాసం.. మళ్లీ అప్పుడే రంగంలోకా?

praveen
తమిళనాడులో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిపోయాయి.  అయితే పదేళ్ల పరిపాలనలో ఉన్న ఏఐఏ డీఎంకే పార్టీ మొదటిసారి జయలలిత మరణం తర్వాత ఇక ప్రత్యక్ష అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలోనే జయలలిత లాంటి కీలక నేతలు లేకపోవడంతో ఏఐఏడీఎంకే పార్టీ అసలు సత్తా చాట లేదని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేదు అని ఎంతో ప్రచారం కూడా జరిగింది. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించింది.  అటు డీఎంకే పార్టీ విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టినప్పటికీ..  ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించి గట్టి ప్రతిపక్ష హోదానే సాధించింది ఏఐఏడీఎంకే పార్టీ.

 ఇలా పదేళ్ల పరిపాలన తర్వాత జయలలిత లేకుండా పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఏఐఏడీఎంకే పార్టీని ముందుకు నడిపించడంలో అటు పళని స్వామి విజయవంతమయ్యారు అనే చెప్పాలి.  ఇకపోతే ప్రస్తుతం ప్రతిపక్ష హోదా సాధించుకున్న ఏఐఏడీఎంకే పార్టీ ని మళ్ళీ ముందుకు నడిపించడానికి చిన్నమ్మ శశికళ రాబోతున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అంటూ ప్రకటించారు చిన్నమ్మ శశికళ. ఇక మొన్ననే రాజకీయ సన్యాసం అంటూ ప్రకటించి మళ్ళీ పార్టీని నడిపించేందుకు రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 ఇటీవలే శశికళ తో ఒక వ్యక్తి మొబైల్ లో మాట్లాడిన సంభాషణ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.  ప్రస్తుతం పార్టీని ఆదుకోవడానికి మీరు రావాలమ్మా అంటూ సదరు వ్యక్తి శశికళను కోరగా..  ఆందోళన అవసరం లేదని నేను ఉన్నాను.. పార్టీని నిలబెట్టడానికి వస్తాను అంటూ హామీ ఇచ్చారు శశికళ. దీన్ని బట్టి చూస్తే ఇక మరికొన్ని రోజుల్లో శశికళ తన గేమ్ స్టార్ట్ చేయబోతున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు.  అదే సమయంలో ఇటీవలే రాజకీయ సన్యాసం తీసుకున్నాను అంటూ తెలిపిన శశికళ... అంతలోనే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతారా అన్నదానిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుంది అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: