దారుణం : బెడ్ కోసం బేరాలు..?

Suma Kallamadi

దేశంలో కరోనా తన పంజా విసురుతోంది. రోజురోజుకూ చాలా మంది ప్రాణాలను తీస్తోంది. ఈ కరోనా టైంలో వైద్యం అందరికీ అందని ద్రాక్షాలా మారింది. ప్రైవేటు ఆస్పత్రులు భారీ మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు తేటతెల్లమవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైద్యం యమ ఖరీదుగా మారంది. కరోనా సోకిన ఓ బాధితురాలికి ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ కోసం ఏకంగా రూ.1.30 లక్షలు డిమాండ్ చేసిన సంఘటన కలకలం రేపుతోంది. రాజస్థాన్ లోని జైసూర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో కేవలం ఐసీయూ బెడ్ కోసమే రూ.1.30 లక్షలు డిమాండ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఓ నర్సును అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ఓ నర్సు తనకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్ ను రూ. 1.30 లక్షలకు విక్రయించినట్టు అశోక్ గుర్జార్ అనే బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
తన భార్య ఐసీయూలో చేరడానికి ముందు లంచం డబ్బులో రూ. 95 వేలను చెల్లించినట్టు తెలిపాడు. బుధవారం చేరిన ఆమె 48 గంటల చికిత్స తర్వాత శుక్రవారం మరణించిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ నర్స్ వదలకుండా మిగతా రూ.35 వేల కోసం ఫోన్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో అశోక్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆదివారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అశోక్ నుంచి రూ. 23 వేల లంచం తీసుకుంటుండగా నర్సును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు ఇతర సిబ్బందితో నిందితుడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం లంచం సొమ్ములో అతడు రూ. 50 వేలు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: