క‌రోనాతో ఆంధ్ర‌జ్యోతి సీనియ‌ర్ విలేఖ‌రి మోహ‌న్‌రావు మృతి

VUYYURU SUBHASH
ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా దెబ్బ‌తో ఎంతో మంది బ‌ల‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా వార్త‌ల‌ను, క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచం ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించే క్ర‌మంలో జ‌ర్న‌లిస్టులు త‌మ ప్రాణాల‌ను కూడా లెక్క చేయ‌డం లేదు. త‌మ వృత్తిలో భాగంగా జ‌ర్న‌లిస్టులో ఈ మ‌హ‌మ్మారికి బ‌లైపోతున్నారు. తాజాగా ఆంధ్ర‌జ్యోతి సీనియ‌ర్ విలేఖ‌రి, తూర్పు గోదావ‌రి జిల్లా స్టాఫ్ రిపోర్ట‌ర్ స‌రాకుల మోహ‌న్ రావు ( 46 ) క‌రోనాతో ఈ రోజు మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం త‌న సోద‌రుడు క‌రోనా భారిన ప‌డ‌డంతో ఆయ‌న‌కు ఆసుప‌త్రిలో ఉండి సేవ‌లు అందిస్తోన్న క్ర‌మంలో మోహ‌న్ రావుకు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే కాకినాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.
గ‌త రాత్రి సైతం తన ఆరోగ్య ప‌రిస్థితిని మిత్రుల‌కు వివ‌రిస్తూ.. తాను క్షేమంగానే తిరిగి వ‌స్తాన‌ని వాట్సాప్‌లో ఫొటోలు సైతం పెట్టారు. అయితే ఈ రోజే క‌రోనా ఆయ‌న్ను బ‌లి తీసుకుంది. మోహ‌న్‌రావు మృతి ప‌ట్ల ఆంధ్ర‌జ్యోతి ఉద్యోగులు, ఆంధ్ర‌జ్యోతి 13వ బ్యాచ్ జ‌ర్న‌లిజం మిత్రులు త‌మ సంతాపం తెలిపారు. వృత్తిప‌ట్ల ఆయ‌న నిబ‌ద్ధ‌త‌ను, ఆయ‌న క‌లుపుగోలు త‌నాన్ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసించారు. జ‌ర్న‌లిజంలో రెండు ద‌శాబ్దాల‌కు పైగా అనుభ‌వం ఉన్న మోహ‌న్‌రావు కాకినాడ‌లో క‌ల్చ‌ర‌ల్‌,  క్రైం రిపోర్ట‌ర్‌గా మ‌న్న‌నలు పొందారు.

2008లో ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం కాలేజ్‌కు ఎంపికైన ఆయ‌న అక్క‌డ శిక్ష‌ణ అనంత‌రం 2009 ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్టేట్ బ్యూరోలో స‌హాయ‌క రిపోర్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం బీట్ రిపోర్ట‌ర్‌కు స‌హాయ‌కులుగా ప‌నిచేసిన ఆయ‌న 2009 జూలైలో కాకినాడ స్టాపర్ అయ్యారు. అప్ప‌టి నుంచి అదే సంస్థ‌లో కొన‌సాగుతూ వ‌చ్చారు. స‌మాజంలో సామాన్య‌, పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన శైలీలో రిపోర్టింగ్ చేయ‌డంలో ఆయ‌న మ‌న్న‌న‌లు పొందారు. ప్ర‌తి ఒక్కరితో క‌లివిడిగా ఉంటూ, వివాదాల‌కు దూరంగా ఉండే ఆయ‌న మృతి జ‌ర్న‌లిజానికి తీర‌ని లోట‌నీ ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ఆయ‌న కుటుంబానికి త‌మ ప్ర‌గాడ సానుభూతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: