గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

Chakravarthi Kalyan
భారత్ కరోనా రెండో వేవ్ కోరల్లో చిక్కుకున్న వేళ అంతర్జాతీయంగా సాయం వెల్లువెత్తుతోంది. అనేక ప్రపంచ దేశాలు ఇండియాకు సాయం చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. కరోనాపై పోరులో భారత్‌కు మద్దతు కొనసాగిస్తాని చెబుతున్న  అమెరికా.. భారత్‌కు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి ప్రకటించింది. భారత్‌కు 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామగ్రి పంపుతున్నామని అమెరికా ప్రకటించింది.
భారత్‌కు సాయంపై అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తి మేరకు సాయం చేస్తామంటోంది అమెరికా. కొవిడ్‌కు సంబంధించిన అత్యవసర పరికరాలు ఇప్పటికే పంపించామని ప్రకటించిన అమెరికా.. 440 ఆక్సిజన్‌ సిలిండర్లు, రెగ్యులేటర్లను కాలిఫోర్నియా రాష్ట్రం విరాళంగా ఇచ్చిందని ప్రకటించింది. భారత్‌కు 9.6 లక్షల ర్యాపిడ్‌ కిట్లు పంపిస్తున్నామని.. ఆరోగ్య కార్యకర్తల కోసం లక్ష ఎన్‌-95 మాస్కులు పంపుతున్నామని అమెరికా తెలిపింది.
యూఎస్‌ ఎయిడ్‌ సంస్థ తరఫున ఇప్పటికే నేరుగా కోటి మందికి సాయం అందిస్తున్నామని  అమెరికా ప్రకటించింది. కరోనాపై పోరులో యూఎస్‌ ఎయిడ్‌ కింద 23 మిలియన్‌ డాలర్ల సాయం అందిస్తున్నామని తెలిపింది అమెరికా. యూఎస్‌ ఎయిడ్‌ తరఫున త్వరలో వెయ్యి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు భారత్‌కు పంపుతామని అమెరికా చెబుతోంది. వాస్తవానికి అమెరికా అంత సులభంగా సాయం ప్రకటించలేదు. భారత్‌ను కష్టకాలంలో ఆదుకోవాలని అమెరికన్ సెనేటర్లు బైడెన్ పై ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత భారత రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్.. సాయం విషయంలో  కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతోనే అమెరికా భారత్‌కు సాయం ప్రకటించింది. అమెరికానే కాదు.. సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌.. ఇలా ఎన్నో దేశాలు భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అయితే  నిన్న మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతి గడించిన ఇండియా ఇప్పుడు ఆక్సిజన్ కోసం ప్రపంచ దేశాలను అడుక్కునే పరిస్థితి మనల్ని ఇబ్బందిపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: