ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ సర్కారు సర్వ శక్తులా కృషి చేస్తోంది. అయితే కరోనా ని క్యాష్ చేసుకునేందుకు చాలామంది డాక్టర్లు రోగుల నుంచి వేలు, లక్షల్లో డబ్బుల నొక్కేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వారికి చికిత్స పొందటం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే ఈ విషయం జగన్ సర్కార్ దృష్టికి రావడంతో అత్యధిక బిల్లులు వసూలు చేసే కార్పొరేట్ ఆస్పత్రులపై కదం తొక్కింది.
ఈ క్రమంలోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ కూడా అందినకాడికి అందినంత పేషెంట్లు నుంచి డబ్బులు కాజేస్తున్నారని తెలియవచ్చింది. దీంతో ఆదివారం రోజు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్న ప్రైవేటు ల్యాబ్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా నిర్ధారణ పరీక్షలకు అధిక బిల్లులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే.. రెండో ఆలోచన లేకుండా వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని మల్లికార్జున హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.499 మాత్రమే వసూలు చేయాలని, లేనియెడల క్రిమినల్ చార్జెస్ తప్పవని ఆయన స్పష్టం చేశారు.
కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్- ఎన్ఏబీఎల్ నుంచి తాజాగా అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్స్ తక్షణమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను సంప్రదించి.. ఎంఎన్ఎస్ పోర్టల్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకోవాలని మల్లికార్జున సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వెంటనే ఎంఎన్ఎస్ పోర్టల్ లో టెస్ట్ ఫలితాల వివరాలు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
మల్లికార్జున ఇంకా మాట్లాడుతూ.. ఒకవేళ ప్రైవేటు ల్యాబ్‌లు ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధనలు పాటించడం లేదని తమకు ఫిర్యాదులు అందితే.. వెంటనే విచారణ జరిపి వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే అధిక చార్జీలు వసూలు చేసే ప్రైవేట్ ల్యాబ్‌లపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అధిక చార్జీలకు బాధితుల అయిన వారు ఎవరైనా సరే 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని మల్లికార్జున చెప్పుకొచ్చారు.