నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!

Chakravarthi Kalyan
నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ విజయం కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటాపోటీగా ప్రయత్నించాయి. ఈ ఉపఎన్నిక ఫలితంపై ఆత్మసాక్షి అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ ఆత్మసాక్షి సంస్థ మద్రాస్ ఐఐటీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటైంది. చాలా వరకూ ఫలితాలను కచ్చితంగా అంచనా వేస్తోంది. సాగర్ ఉపఎన్నికపై ఈ సంస్థ ఏం చెబుతుందంటే..తక్కువ మెజారిటీతో నాగార్జున సాగర్ సీటును టీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందట.
సాగర్‌లో టీఆర్ఎస్‌ 43 శాతం వరకూ ఓట్లు వస్తాయట. కాంగ్రెస్‌కు 39 శాతం వరకూ సీట్లు వస్తాయట. ఇక బీజేపీ మూడో స్థానంలో ఉంటుందట. ఈ పార్టీకి 12 శాతం వరకూ ఓట్లు వస్తాయట. మొత్తం మీద 7 వేల నుంచి 10 వేల మెజారిటీతో ఈ సీటును టీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందని ఈ ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. అయితే స్థానికంగా ఉన్న నేతల నుంచి వస్తున్న  సమాచారం మాత్రం పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు వస్తోంది. మరి ఆత్మ సాక్షి సర్వే నిజం అవుతుందా.. లేక ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అన్నది మే 2న ఓట్ల లెక్కింపు ద్వారానే తేలాల్సి ఉంది.
ఇక నాగార్జున సాగర్ ఉపఎన్నిక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి కారణంగా వచ్చిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సొంత నియోజక వర్గమైన నాగార్జున సాగర్‌ సీటును టీఆర్ఎస్ 2018 ఎన్నికల్లోనే తొలిసారిగా గెలుచుకుంది. అయితే ఉప ఎన్నికల్లో ఈ టికెట్‌ను టీఆర్ఎస్‌ చివరి నిమిషయంలో నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కే ఇచ్చింది. ఈ ఎన్నికను జానారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గట్టి పోటీ ఎదురైంది.
సాగర్‌లో టీఆర్ఎస్ పరిస్థితి అంత సవ్యంగా లేదన్న కారణంతోనే ఇక్కడ కేసీఆర్ స్వయంగా ప్రచారానికి దిగాల్సి వచ్చింది. గెలుపు కోసం అధికార పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది. మరో వైపు కాంగ్రెస్‌లో జానారెడ్డి ఒంటరి పోరాటం సాగించారు. అయితే సొంత నియోజక వర్గం కావడం ఆయనకు బలమైన అంశంగా మారింది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: