సెల్ టవర్ ఎక్కినా యువకుడు.. నాలుగు గంటలు పోలీసులకు చుక్కలు.. చివరికి..!

N.ANJI
సమాజంలో కొంత మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదని సురేష్ అనే వ్యక్తి మనస్తాపంతో మొబైల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు. భార్య కాపురానికి వస్తేనే కిందికి దిగుతానని.. లేకుంటే దూకుతానని బెదిరిస్తున్నాడు. దీంతో అలర్ట్ అయిన బీఎస్ఎన్‌ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సురేష్‌తో సంప్రదింపులు జరిపారు. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోగా.. భార్య వస్తేనే టవర్ దిగుతానంటూ పైనే భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో పోలీసులు సురేష్ భార్యను ఫోన్‌లో సంప్రదించారు. సురేష్ పరిస్థితిని ఆమెకు వివరించారు. సురేష్ భార్య నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాను రానని తెగేసి చెప్పింది.
దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి బాధితుడు సురేష్‌కు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇలా అతన్ని కిందకు దించేందుకు నాలుగు గంటల పాటు పోలీసులు, అధికారులు శ్రమించారు. చివరికి పోలీసుల హామీని విశ్వసించిన సురేష్ సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. దాంతో పోలీసులు, అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే హైదరాబాద్‌లోని హయత్ నగర్‌కు చెందిన సురేష్‌కు కొంతకాలం క్రితం వివాహం అయ్యింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కుటుంబ ఘర్షణల నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం సురేష్ భార్య.. తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సురేష్ వద్దకు వచ్చేది లేదని తేల్చి చెబుతోంది. సురేష్ అత్తమామలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సురేష్ ఇవాళ మంచిర్యాలలోని తన భార్య ఇంటికి వెళ్లాడు. ఇంటికి రావాల్సిందిగా కోరాడు. కానీ, సురేష్ ససెమిరా అని తేల్చి చెప్పింది. దాంతో సురేష్ సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి అతను సెల్‌టవర్ దిగి కిందకు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: