బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!
ఇక తిరుపతి ఉప ఎన్నికల్లోనూ రెండు పార్టీల నేతల మధ్య మామూలు మాటల యుద్ధం జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఓ చోట మాత్రం బీజేపీ గెలుపు కోసం రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. వైసీపీలో సాదాసీదా నేతలే కాదు ఏకంగా మంత్రులే బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు తమకు ఉన్న అన్ని ఛానెల్స్ వాడేస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం వైసీపీ తమ వంతుగా సాయం చేస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన యానాం (కాకినాడ సమీప ప్రాంతం) ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బయటకు వచ్చాక మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌ను వదిలేశారు.
చివరకు అక్కడ ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. యానాం ఎమ్మెల్యే కృష్ణారావు రాజీనామా వెనక ఏపీ సీఎం జగన్ ఉన్నారని.. బీజేపీ జగన్ ద్వారా ఒత్తిడి చేయించి కృష్ణారావుతో రాజీనామా చేయించదన్న ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు పుదుచ్చేరి ఎన్నికలు జరుగుతున్నా కృష్ణారావు ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. పుదుచ్చేరిలో అన్నాడీఎంకే, బీజేపీ, రంగస్వామి పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి.
ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగస్వామి ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన్ను యానాం తీసుకువచ్చి మరీ ఇక్కడ పోటీ చేయిస్తున్నారు. ఇప్పుడు ఆయన గెలుపుకోసం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రులు చాలా మంత్రాంగం నడుపుతున్నారు. వైసీపీ, బీజేపీ శత్రువులుగా ఉన్నా యానాంలో మాత్రం రంగస్వామి గెలుపుకోసం వైసీపీ పడుతోన్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.