ఈ గుంటూరు ఎస్సీ సూపరంతే... సీఐకే ఫైన్ వేశాడు...!
తాజాగా గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి.. గుంటూరు లాడ్జి కూడలి వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు పెట్టుకోని వారికి ఫైన్లు విధించటం.. మాస్కులు పెట్టుకోవాలంటూ కౌన్సెలింగ్ చేపట్టారు. అదే సమయంలో అటుగా వెళుతున్న గుంటూరు సీఐను ఆయన ఆపారు. మాస్కు పెట్టుకోకుండా ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. అత్యవసర విధుల్లో హాజరు కావటానికి వెళుతున్నానని.. దాంతో మాస్కు పెట్టుకోవటం మర్చిపోయినట్లుగా ఆ సీఐ బదులిచ్చారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నఆయన.. మాస్కు ధరించనందుకు ఫైన్ వేయాలని అధికారులకు సూచించారు.
అంతేకాదు..ప్రత్యేకంగా మాస్కు తెప్పించి మరీ ఆయన చేత ధరించేలా చేశారు. రోడ్డు మీద మాస్కులు పెట్టుకోకుండా వెళుతున్న వారిని ఆపి.. కౌన్సెలింగ్ చేసి పంపారు. వ్యాపారులు సైతం మాస్కులు ధరించిన వారినే లోపలకు అనుమతించాలని చెప్పారు. షాపుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ మాదిరి.. ప్రతి ఊరికి ఒకరిద్దరు అధికారులు ఈ తీరులో ఉంటే.. ప్రజలంతా మాస్కులు ధరించటం చాలా తక్కువ కాలంలోనే అలవాటు కావటం ఖాయం. ప్రజలు కరోనా జాగ్రత్తలు మర్చిపోతున్నారు. ఇలా కఠిన నిబంధనలు అమలు చేయకపోతే వీరు లైన్లోకి వచ్చేలా లేరు.