ఇలా అయితే.. జ‌గ‌న్-సాయిరెడ్డిల‌ను న‌మ్మెదెవ‌రు... ఢిల్లీలో ప‌రువు పోయిందా ?

VUYYURU SUBHASH
ఒకే రోజు ఢిల్లీలో చోటు చేసుకున్న రెండు ప‌రిణామాలు.. వైసీపీ కీల‌క నేత‌లు.. పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్‌పైనా.. ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పైనా అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకునే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది. ఒక‌టి సుప్రీం కోర్టులో చోటు చేసుకోగా.. మ‌రొక ఘ‌ట‌న సాక్షాత్తూ రాజ్య‌స‌భ‌లో చోటు చేసుకుంది. ఈ రెండు ప‌రిణామాలు కూడా జ‌గ‌న్‌... సాయిరెడ్డిల విశ్వ‌స‌నీయ‌త‌ను ఘోరంగా దెబ్బ‌తీయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఒక‌టి:  ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తే.. సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ కుటుంబంపై సీఎం జ‌గ‌న్ ఏకంగా సుప్రీం సీజే బాబ్డేకు ఫిర్యాదు చేశారు. 'చంద్రబాబు, జస్టిస్ రమణల మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. నేను(సీఎం జ‌గ‌న్‌) ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాట చెబుతున్నాను. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చలమేశ్వర్ ఈ విషయాలను సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బాబు, జస్టిస్ రమణలు ఇచ్చిన అభిప్రాయాలను మీముందు ఉంచుతున్నాను. టీడీపీకి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు హైకోర్టు జడ్జీల డ్యూటీ రొటేషన్‌ను(జడ్జీల రోస్టర్) జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారు.

హైకోర్టు సిట్టింగులను ప్రభావితం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కొందరు జడ్జీలు, జస్టిస్ రమణ, తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాన్ని తెలుపుతోంది.  ఈ అంశాలు పరిశీలించి, న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉంటడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాలి'' అని భారత ప్రధాన న్యాయమూర్తిని సీఎం జ‌గ‌న్ కోరారు. అయితే.. తాజాగా దీనిని అంత‌ర్గ‌తంగా విచారించిన సుప్రీం కోర్టు.. జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు వాస్త‌వదూర‌మ‌ని స్ప‌ష్టం చేస్తూ.. త‌దుప‌రి సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఎన్వీర‌మ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దీంతో జ‌గ‌న్ ప‌రువు పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రెండు:  వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. సాయిరెడ్డి.. వ్య‌వ‌హారం. టీడీపీ హ‌యాంలో 2017, జ‌న‌వ‌రి 26న విశాఖ ఎయిర్‌పోర్టులో తన దాడి జరిగిందని విజయసాయిరెడ్డి పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ రోజు విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేయడానికి ప్రజాసంఘాల సిద్ధమయ్యా యి. అప్పట్లో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరుగుతుండడంతో ఆ స్పూర్తితో అందరూ ముందుకు రావాలని సోషల్ మీడయాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే చివరివరకు స్పందించకుండా ఉన్న వైసీపీ.. ఉద్యమానికి మంచి స్పందన వచ్చేసరికి జగన్, విజయసాయితో పాటు ముఖ్యనేతలు హైదరాబాద్‌లో విమానం ఎక్కి విశాఖలో దిగారు. అయితే అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు.

విమానాశ్రయంలోను జగన్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టులో జగన్, విజయసాయి ధ‌ర్నాకు దిగారు. పోలీసులను తోసేశారు. తాము అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తామని హెచ్చరించారు. ఈ ఘటనలో విజయసాయి చాలా దూకుడుగా వ్యవహరించారు. ఆయన పోలీసులను తోసేస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. పోలీసులే త‌న‌పై దాడి చేశారంటూ ఎంపీ హోదాలో రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ .. సుమారు రెండేళ్ల‌పాటు(క‌రోనా టైం త‌ప్ప‌) విచార‌ణ జ‌రిపింది.

తాజాగా దీనితాలూకు నివేదిక‌ను చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడుకు స‌మ‌ర్పించింది. దీనిలో సాయిరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు వాస్త‌వ దూర‌మ‌ని.. పేర్కొంది. దీంతో సాయిరెడ్డి ప‌రువు కూడా పోయిన‌ట్ట‌యింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలా ఒకే రోజు ఇద్ద‌రు వైసీపీ కీల‌క నాయ‌కులు ఢిల్లీలో బ‌ద్నాం అయ్యార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: