ఈ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి పత్రిక-ఏబీన్ ఛానల్ గవర్నర్ పై వరుసగా నెగిటివ్ కథనాలు ఇస్తున్నాయి. ఇవి రాజకీయంగానూ సంచలనం కలిగిస్తున్నాయి. సాధారణంగా రాజ్యాంగ బద్దంగా అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, గవర్నర్, లోక్ సభ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ వంటి వారి విషయంలో కాస్త మీడియా సంయమనం పాటిస్తుంది. పక్కా సమాచారం ఉంటే తప్ప వీరి విషయంలో మీడియా అత్యుత్సాహం చూపదు.
కానీ గవర్నర్ నరసింహన్ పై ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ దూకుడుగా నెగిటివ్ కథనాలు ఇవ్వడం వెనుక.. ఆయన్ను తప్పిస్తారన్న విశ్వసనీయ సమాచారమే కారణమని తెలుస్తోంది. అందుకే.. ఎలాగూ వెళ్లిపోయే గవర్నరే కదా అని... ఏబీఎన్ జూలు విదిల్చింది. ఆయన ను కేంద్రం తప్పించబోతున్నదని, కేరళ గవర్నర్ గా ఉన్న సదాశివన్ ను తీసుకు వస్తారని ప్రచారం చేసింది.
ఐతే.. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి అంచనాలు తప్పినట్టు కనిపిస్తోంది. ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను మార్చుతారని జరిగిన ప్రచారం అంతా ఊహాగానమేనని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. డిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ఆలోచన ఏదీ లేదని చెప్పారు. మరి గవర్నర్ బదిలీ విషయంలో ఆంధ్రజ్యోతి బొక్కబోర్లాపడిందా.. లేక.. కాస్త ఆలస్యమైనా ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమవుతుందా. వెయిట్ అండ్ సీ..